చంద్రబాబు అరెస్ట్ పై ఎలుగెత్తుతూ వరుసగా 14వ రోజు టీడీపీ నిరసనలు... ఫొటోలు ఇవిగో!

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, దీక్షలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వరుసగా 14వ రోజు కూడా ఆందోళనలు కొనసాగించాయి. అనంతపురం గ్రామీణం మండలం పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఉదయాన్నే దీక్ష శిబిరాన్ని చుట్టుముట్టి పోలీసులు పరిటాలను సునీతను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పరిశీలనకు వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నగరిలో గాలి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో నగరి నుండి తిరుత్తణి వరకు పాదయాత్ర నిర్వహించారు. 

రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామంలో ఉన్న చెరువులో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు జలదీక్ష కార్యక్రమం నిర్వహించి అర్ధనగ్న ప్రదర్శనతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆదోని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రోడ్డుపై న్యాయ దేవతను ఏర్పాటు చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని, చంద్రబాబును న్యాయ దేవత కాపాడాలంటూ రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. 

కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఇంఛార్జ్ సత్యానందరావు అంబేద్కర్ రాజ్యాంగ పాలన మానేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్ దున్నపోతు నిద్రమాని మేలుకోవాలని, జగన్ మేలుకుని ప్రతిపక్షాలపై అక్రమ అరెస్టులు ఆపాలని దున్నపోతుకు వినతి పత్రాన్ని సమర్పించి వినూత్న నిరసన తెలియజేశారు. దున్నపోతు లాంటి వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధిని ప్రసాదించు దేవుడా అని ప్రార్థించారు. 

ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ నుండి యర్రవరం ప్రసన్న  ఆంజనేయస్వామి ఆలయం వరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల సత్య ప్రభ రాజా ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర అనంతరం యర్రవరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామానికి చెందిన వల్లూరి శ్రీవాణి 25వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టారు. రెండు జిల్లాలు పర్యటించి చంద్రబాబు అరెస్టు గురించి ప్రజలకు వివరిస్తున్నారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మరియు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల నాగభూషణం మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు డేగల కృష్ణమూర్తి, వేలూరు రంగయ్య, ఆలం వెంకట నరస నాయుడు, ముత్యాలపనాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 

ఉరవకొండ నియోజకవర్గ వాల్మీకి బోయలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం వాల్మీకి బోయలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఇంచార్జి థామస్ ఆధ్వర్యంలో చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలో ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. 

కాకినాడ రూరల్ మండలం వలసపాకల సెంటర్ లో  రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ట్రాక్టర్ లతో రైతులు వినూత్నంగా  ర్యాలీ చేపట్టారు. అనంతరం రైతులతో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. 

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ఎండీ షరిఫ్, బొండా ఉమామహేశ్వరరావు, ఎన్.ఎం.డి ఫరూక్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జ్యోతుల నవీన్, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణరావు, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, బికె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



More Telugu News