చంద్రబాబు బయటకు వచ్చే వరకు పోరు ఆగదంటూ... 16వ రోజు కూడా టీడీపీ నిరసనల హోరు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిరసన బాటపట్టిన టీడీపీ శ్రేణులు
  • వివిధ రూపాల్లో ప్రభుత్వ చర్యను విమర్శిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కావడంతో టీడీపీ శ్రేణులు నిరసన బాటపట్టాయి. ఇవాళ 16వ రోజు కూడా వైసీపీ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ, చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వివిధ రకాల ప్రదర్శనలు చేపట్టారు. ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా 16వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 

పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్ళపల్లి, వెల్లలూరు, మునిపల్లె, పచ్చలతాడిపర్రు గ్రామాలలో ఇంఛార్జి ధూళిపాళ్ల నరేంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు. పెనమలూరు నియోజకవర్గంలో ఇంఛార్జి బోడె ప్రసాద్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా, నియోజకవర్గాల ఇంఛార్జిలు, అనుబంధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. 

పెనుకొండ నియోజకవర్గంలో సత్యసాయి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పెనుకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష, అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో మత్స్యకారులతో కలిసి పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు జల దీక్ష చేపట్టారు. గ్రామ దేవతలకు ముర్రాటలు సమర్పించి మహిళల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పులివెందులలో బీటెక్ రవి ఆధ్వర్యంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మేదర రవికుమార్ గిరిజన వేషధారణతో వినూత్నంగా హాజరయ్యారు. దాసరి దేవేంద్ర అర గుండుతో నిరసన తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంలో అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. పలమనేరులో తలకిందులుగా నిలబడి వినూత్నంగా నిరసన చేపట్టారు. 

ఆదోని నియోజకవర్గంలో ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో గాడిదలకు వినతి పత్రం ఇచ్చి, ఇప్పుడైనా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని కక్షపూరితమైన చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహార చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో ఓ అంబేద్కర్ మహాశయా నీవు రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావడంలేదు... జగన్ రెడ్డి జంగిల్ రాజ్యంలో కక్ష సాధింపులే పాలన అనేలా పరిపాలన సాగుతోందంటూ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు నిరసన తెలిపారు. 

పల్నాడు జిల్లా  టీడీపీ అధ్యక్షుడు జీ.వీ.ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో నల్ల బ్యాడ్జీలు కట్టుకుని మౌన ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మడకశిరలో ఇంఛార్జి గుండుముల తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాడుగుల నియోజవర్గంలో ఇంచార్జ్ పీవీజీ కుమార్ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. 

అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ దేవీచౌక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కస్తాలలో తెలుగు మహిళల జలదీక్ష చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ పుట్టిపాటి ఆంజనేయస్వామి గుడిలో తెలుగు మహిళల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల శివారు హంసలదీవి బీచ్ వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు జలదీక్ష చేపట్టాయి.


More Telugu News