చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వరుసగా 18వ రోజు టీడీపీ దీక్షలు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు
  • వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 18వ రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. టీడీపీ నేతలు పలు రూపాల్లో నిరసనలు తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో టీఎన్‍ఎస్‍ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రణవ్ గోపాల్ దీక్షకు రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. 

విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్ద నుండి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో గోపాలపురం ఇంఛార్జి మద్దిపాటి వెంకట్రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శిష్ట్లా లోహిత్ ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వానికి పాడె కట్టి శవయాత్ర చేపట్టారు. దీంతో మద్దిపాటి వెంకటరాజు, శిష్ట్లా లోహిత్ సహా మరో 50 మందిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. 

కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ స్వగ్రామం ఇర్రిపాకలో శివాలయం నుండి కాకినాడ జిల్లాలో చిన తిరుపతిగా పేరుగాంచిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. నందిగామ పట్టణంలోని రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "బాబు కోసం మేము సైతం" అంటూ మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

అద్దంకి టౌన్‌లో అంబేద్కర్ విగ్రహం నుండి బల్లికురవ గ్రామం వరకు 30 కి.మీలు 2,000 బైకులతో ర్యాలీ నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జి బోడే ప్రసాద్ ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. బోడే ప్రసాద్ దీక్షకు గద్దె రామ్మోహన్ రావు, బొండా ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ కొనకళ్ళ నారాయణరావు, కొనకళ్ళ బుల్లయ్య, బచ్చల బోసు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. 

ఉంగుటూరు నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరహార దీక్షలో భాగంగా ఏలూరు అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు చేతికి సంకెళ్ళు వేసుకొని నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లాలో పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీ ఘాట్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా, కౌన్సిలర్లు, పార్టీ నేతలు జల దీక్ష చేపట్టారు. రేపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో సంకట హర గణపతి సహిత ఆయుష్షు హోమం నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలో ఎస్సీ నేతల ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన తెలిపారు.

గూడూరులోని ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్‌లోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ని నెల్లూరు టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పనబాక కృష్ణయ్య, సందర్శించారు.

అక్కడ వున్న కంప్యూటర్స్, మోటార్స్, టేబుల్స్, ట్రైనింగ్ సెంటర్ లో వున్న పరికరాలను.. ట్రైనింగ్ విషయాలను తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్ మెంట్స్ కార్పోరేషన్ వలన ఇంతలా మేలు జరుగుతుంటే..  వైసీపీ నేతలకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. 

గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకి నుంచి బల్లికురవ వరకు బైక్ ర్యాలీ తలపెట్టగా, చిలకలూరిపేటలో గొట్టిపాటిని గృహనిర్బంధం చేసినట్టు టీడీపీ నేతలు వెల్లడించారు.


More Telugu News