ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ఆయ్యప్ప దీక్షను పూర్తి చేసిన రామ్ చరణ్.. అభిమానుల తొక్కిసలాట.. ఫొటోలు ఇవిగో!

  • ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్షను తీసుకున్న రామ్ చరణ్
  • చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ అభిమానులు
  • యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన చరణ్
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించారు. చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను ఆయన వేసుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు.

అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంతో నిష్ఠగా ఉంటారు. అయ్యప్ప దీక్ష సమయంలో చరణ్ కూడా కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలతో నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అక్కడి అభిమానులను ఆకర్షించింది. 

మరోవైపు రామ్ చరణ్ సిద్ధి వినాయక ఆలయానికి వచ్చారనే వార్త ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు క్షణాల్లో పాకింది. ఆయనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారిని నిలువరించడానికి సెక్యూరిటీ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. అభిమానుల మధ్య నుంచి వెళ్లడానికి చరణ్ చాలా ఇబ్బంది పడినప్పటికీ... అందరికీ నవ్వుతూ అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక యాడ్ షూటింగ్ కోసం చరణ్ ముంబైకి వెళ్లారు.


More Telugu News