ఐటీ ఉద్యోగుల మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ సమాధానం!

  • తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారని వ్యాఖ్య
  • తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడిస్తామన్న బాలకృష్ణ
  • పొత్తులపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ
  • తెలంగాణలో టీడీపీ లేదన్నవారికి మేమేంటో చూపిస్తామన్న బాలకృష్ణ
త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అందుకే కొంతమంది నేతలు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని, ఈ ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తాయన్నారు. 

చంద్రబాబు నిజాయతీ అందరికీ తెలిసిందేనని, రాజకీయ కక్ష సాధింపు కారణంగానే అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రతి ఒక్కరు ఆయన అరెస్టును ఖండిస్తున్నారన్నారు. అయితే తెలంగాణలో మాత్రం మూడు రోజుల నుంచి ఎక్కువగా ఖండిస్తున్నారని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని, ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తోందన్నారు. రాజకీయ లబ్ధి కంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పని చేయాలన్నారు.

ఐటీ ఉద్యోగులు ఏపీకి వెళ్లి ఆందోళనలు చేసుకోవాలని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ పరోక్షంగా స్పందించారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పుడు సమయం వచ్చిందని, టీడీపీ జెండా తప్పకుండా తెలంగాణలో రెపరెపలాడుతుందన్నారు. తెలంగాణలో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని, ఇక్కడ పార్టీ పూర్వవైభవానికి పోరాడుతామన్నారు. పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారని, తెలంగాణలో టీడీపీ లేదన్నవారికి తామేంటో చూపిస్తామన్నారు.


More Telugu News