కలసి పోయిన కోహ్లీ, నవీనుల్ హక్.. ఇక శాంతించాల్సింది అభిమానులే!

  • నిన్నటి మ్యాచ్ లో నవీనుల్ ను రెచ్చగొట్టిన భారత అభిమానులు
  • అలా చేయవద్దంటూ సైగలతో సూచించిన కోహ్లీ
  • చివరికి స్నేహంగా పలకరించుకున్న కోహ్లీ, నవీనుల్
భారత్ లో విరాట్ కోహ్లీకి అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. గత ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు జట్టు సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీకి, లక్నో జట్టు సభ్యుడైన ఆప్ఘానిస్థాన్ బౌలర్ నవీనుల్ హక్ మధ్య విభేదాలు పొడచూపడం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి నవీనుల్ ఎక్కడ కనిపించినా అభిమానులు కోహ్లీ నామస్మరణతో అతడిని లక్ష్యం చేసుకుంటున్నారు. కోహ్లీ, నవీనుల్ మధ్య సోషల్ మీడియాలోనూ ఆ మధ్య కొన్ని రోజుల పాటు వార్ నడిచింది. మ్యాచ్ రిఫరీ కోహ్లీ, నవీనుల్ కు మ్యాచ్ ఫీజులో కోత వేయడం జరిగింది.

తాజాగా వన్డే ప్రపంచకప్ లో భాగంగా బుధవారం భారత్-ఆప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నవీనుల్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, బ్యాట్ చేస్తున్న సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు కోహ్లీ నామస్మరణ చేశారు. చివరికి విరాట్ కోహ్లీ స్వయంగా అలా వ్యవహరించడం సరికాదంటూ అభిమానులకు సైగల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ లో భాగంగా కోహ్లీ, నవీనుల్ ఇద్దరు ఆత్మీయంగా, స్నేహభావంతో ఒకరిపై ఒకరు చేయి వేసుకుని, నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. తమ మధ్య విభేదాలు ఏమీ లేవన్న సంకేతాన్ని వారు ఇచ్చారు. ఇక కోహ్లీ అభిమానులు శాంతించినట్టేనా, లేదంటే మరో విడత నవీనుల్ కనిపించినప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిపై సంతోషంగా స్పందించారు. క్రీడల్లో ఇలాంటివి మామూలేనన్నారు. గతం గత: అంటూ, కాలంతో పాటు ముందుకు సాగిపోవాలన్నట్టు వేదాంత ధోరణితో స్పందించారు. సమయమే గాయాలను మాన్పుతుందన్నారు. (వీడియో 1)  (వీడియో 2)


More Telugu News