కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన గద్దర్ కుటుంబం
- గద్దర్ బతికున్న రోజుల్లో టికెట్ ఇస్తామని చెప్పారన్న కుటుంబ సభ్యులు
- ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని విమర్శ
- ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీపై ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులు విమర్శలు గుప్పించారు. గద్దర్ బతికున్న రోజుల్లో టికెట్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని... ఇప్పుడు తమను అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా... ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని గద్దర్ కుమార్తె వెన్నెల తెలిపారు. గద్దర్ పోరాటాలు, త్యాగాలను దృష్టిలో ఉంచుకుని తమకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందనే తాము ఆశిస్తున్నామని అన్నారు. తమకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ... ఆ పార్టీపై ఎంతో సానుభూతి ఉందని చెప్పారు. 2023 ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అవకాశమిస్తే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. గద్దర్ భార్య విమల మాట్లాడుతూ... తమ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇస్తే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని చెప్పారు.