‘టైమ్‌డ్ ఔట్’పై షకీబ్ అల్ హసన్‌కు ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ !

  • షకీబ్ శ్రీలంక వస్తే రాళ్లు విసురుతామని హెచ్చరిక
  • ‘టైమ్‌డ్ ఔట్’ తమను నిరాశకు గురి చేసిందని వ్యాఖ్య
  • బంగ్లా కెప్టెన్ నుంచి ఆటగాళ్ల వరకు ఇలాంటి ప్రవర్తన ఊహించలేదని విమర్శలు
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీలంకకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ ‘టౌమ్‌డ్ ఔట్’ అయిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ఈ రికార్డ్ నమోదయ్యింది. ఈ ఔట్‌ ఒక వివాదంగా మారిపోయింది. హెల్మెట్ సమస్య కారణంగా నిర్దేశిత సమయంలోగా మాథ్యూస్ క్రీజులోకి రాలేకపోయాడని, దానిని అప్పీల్ చేయడం తగదని పలువురు తప్పుబడుతున్నారు. మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాలంటూ అప్పీల్‌‌ చేసిన షకీబ్ అల్ హసన్‌కు క్రీడాస్ఫూర్తి లేదని విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ‘టైమ్‌డ్ ఔట్’పై మాథ్యూస్ సోదరుడు కూడా స్పందించాడు.

‘టైమ్‌డ్ ఔట్’ పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని మాథ్యూస్ సోదరుడు ట్రెవిస్ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్‌కు క్రీడా స్ఫూర్తి లేదని, జెంటిల్‌మెన్ గేమ్‌లో మానవత్వం చూపలేదని తీవ్రంగా విమర్శించాడు. బంగ్లా కెప్టెన్‌తోపాటు మిగతా సభ్యుల నుంచి ఇలాంటి ప్రవర్తన ఉంటుందని తాము భావించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై శ్రీలంకలో షకీబ్‌కు స్వాగతం లభించబోదని, అంతర్జాతీయ మ్యాచ్‌లు లేదా శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఆడడానికి వస్తే అతడిపై రాళ్లు విసురుతామని హెచ్చరించాడు. అభిమానుల ఆగ్రహాన్ని తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుందని మండిపడ్డాడు. బీడీక్రిక్‌టైమ్స్‌తో మాట్లాడుతూ ట్రెవిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ‘టైమ్‌డ్ ఔట్’గా నిలిచిన మొదటి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. హెల్మెట్ సమస్యను సరిచేసుకొనే క్రమంలో నిర్దేశిత 2 నిమిషాల సమయంలోగా క్రీజులోకి రాలేకపోవడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీల్ చేశాడు. పరిశీలించిన ఫోర్త్ అంపైర్లు ఔట్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.


More Telugu News