కాంగ్రెస్ గెలిస్తే 6 గ్యారెంటీలు అమలవుతాయో లేదో కానీ...: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ వస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతారన్న కేటీఆర్
  • కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయని వ్యాఖ్య
  • తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అన్న మంత్రి కేటీఆర్
  • ఐటీ ఉపాధి కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమిస్తున్నట్లు వెల్లడి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయో లేదో కానీ 6 నెలలకు ఓ ముఖ్యమంత్రి మారడం మాత్రం ఖాయమని తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధికి స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్‌షిప్ అవసరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిత్యం పదవుల కొట్లాటలు తప్పవన్నారు. సంపద సృష్టించాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్నారు. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే శాంతిభద్రతల ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

కర్ణాటక ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందన్నారు. 40 శాతం కమిషన్ అని బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు చదరపు అడుగుకు రూ.500 వరకు బిల్డర్స్ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గొప్పదనం, తెలంగాణ గొప్పతనం ఇక్కడున్న వారికి అర్థం కాదన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలను చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులు వస్తుండటంతో నగరంలో సంపద పెరుగుతోందన్నారు.

తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్‌ అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 శాతం నుంచి 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందన్నారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామన్నారు. కొత్త రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య సరికొత్త హైదరాబాద్ తయారవుతోందన్నారు. నగరానికి రాకపోకలు చాలా సులువుగా జరగాలన్నారు. త్వరలో ప్రతి రోజు తాగునీరు వచ్చేలా చూస్తామన్నారు.

రెండేళ్ల పాటు కరోనా ఉన్నప్పటికీ ఐటీలో దూసుకెళ్తున్నామన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమిస్తూ వస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రగతి, అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్నారు. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు ప్రచారం చేశారనీ, కానీ హైదరాబాద్‌లో రేట్లు 10 నుంచి 20 రెట్లు పెరిగాయన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతా భూముల రేట్లు అధికమయ్యాయన్నారు. మాజీ సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారన్నారు. 2014కు ముందు వ్యవసాయానికి ఆధారం లేదని, పెట్టుబడి, నీళ్లు, కరెంటు ఉండేది కాదన్నారు. నాడు రైతులు ఆస్తులు అమ్ముకున్నా అప్పులు కట్టలేని దుస్థితి ఉండేదని, నేడు వారికి భూములే భరోసా అన్నారు. భూముల విలువ పెరగడంతో రాష్ట్రంలోని వ్యక్తుల్లో ధీమా వచ్చిందన్నారు.


More Telugu News