అబ్బ..ఏమి 'షమీ-ఫైనల్'! సచిన్ ప్రశంసలు

  • నిన్నటి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన షమీ
  • ఈ టోర్నీలో నాలుగోసారి ఐదు లేదా అంతకుమించి వికెట్లు తీసిన వైనం
  • 17 ప్రపంచకప్ మ్యాచుల్లోనే 50 వికెట్లు తీసి అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు
  • ఇది షమీ-ఫైనల్ అంటూ సచిన్ ప్రశంసలు
వరల్డ్ కప్‌లో భారత్ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. నిన్నటి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తొలి నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో తొలి నుంచి చెలరేగిపోతున్న షమీ నిన్నటి మ్యాచ్‌లో అత్యద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను మట్టి కరిపించాడు. తొలుత ఓపెనర్లను స్వల్ప కోర్సులకే ఔట్ చేసి న్యూజిలాండ్ ఓటమికి పునాది వేశాడు. ఆ తరువాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ విజయాన్ని ఖాయం చేశాడు. 

మ్యాచ్ ఆసాంతం తన ఆధిపత్యం కొనసాగించిన షమీపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది సెమీ ఫైనల్ కాదని షమీ-ఫైనల్ అని చమత్కరించాడు. అటూ బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ‌లో రాణించిన టీమిండియాను ‘ఎక్స్’ వేదికగా అభినందించాడు. 

కాగా, ఈ వరల్డ్ కప్‌లో షమీ నాలుగు పర్యాయాలు ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మిచెల్ ప్రపంచకప్‌ మ్యాచుల్లో మూడు సార్లు ఐదు, అంతకుమించి వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా, ప్రపంచకప్‌‌ మ్యాచుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మిచెల్ స్టార్క్ ఇటీవల ఈ టోర్నీలోనే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. మిచెల్ 19 ప్రపంచకప్ వన్డే మ్యాచుల్లో 50 వికెట్లు తీయగా షమీ 17 మ్యాచులకే ఈ ఫీట్ సాధించాడు.


More Telugu News