సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా కోహ్లీనే బద్దలు కొడతాడు: రవిశాస్త్రి

  • అన్ని ఫార్మాట్లలో 100 సెంచరీలు... సచిన్ పేరిట ఉన్న రికార్డు
  • ప్రస్తుతం 80 సెంచరీలు సాధించిన కోహ్లీ
  • సచిన్ రికార్డుకు కోహ్లీ చేరువలోకి వచ్చాడన్న రవిశాస్త్రి
  • కోహ్లీ వంటి ఆటగాళ్లకు అసాధ్యమనేది ఉండదని వెల్లడి
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఓ శిఖరం. సచిన్ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే సచిన్ నమోదు చేసిన రికార్డుల్లో ముఖ్యమైనది... వన్డేల్లో 49 సెంచరీలు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ సెమీస్ లో సెంచరీ చేయడం ద్వారా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 

ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా కోహ్లీనే బద్దలు కొడతాడని ధీమాగా చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు సాధించిన రికార్డు సచిన్ పేరిట ఉందని, ప్రస్తుతం కోహ్లీ 80 సెంచరీలతో ఉన్నాడని రవిశాస్త్రి వివరించారు. ఇప్పుడున్న క్రికెటర్లలో సచిన్ 100 సెంచరీల ఘనతకు చేరువలో ఉన్నది కోహ్లీ మాత్రమేనని తెలిపారు. 

కోహ్లీ వంటి ఆటగాళ్లకు అసాధ్యమనేది ఉండదని, ఓసారి సెంచరీల వేట షురూ అయితే ఇక ఆగదని అన్నారు. మరో 10 ఇన్నింగ్స్ లలో కోహ్లీ నుంచి 5 సెంచరీలు ఖాయమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడని, మరో మూడ్నాలుగేళ్లు ఆడే సత్తా అతడిలో ఉందని పేర్కొన్నారు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక సెంచరీ ఉన్నట్టు రవిశాస్త్రి వివరించారు. 

సచిన్ ఆ రోజుల్లో 100 సెంచరీలతో రికార్డు సృష్టిస్తే, దాని దరిదాపులకు ఎవరైనా వస్తారా అన్న సందేహం కలిగిందని, కానీ కోహ్లీ ఇప్పుడా రికార్డును సమీపించాడని అన్నారు.


More Telugu News