తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ పథకాల ప్రకటనలు..ఈసీ కీలక ఆదేశాలు

  • తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ పథకాల ప్రకటనలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
  • స్పందించిన ఈసీ, కర్ణాటక సీఎస్‌కు నోటీసులు
  • ప్రకటనలు తక్షణం నిలిపివేయాలని ఆదేశం
  • ఇప్పటివరకూ ఇచ్చిన ప్రకటనలపై సీఎస్ వివరణ కోరిన వైనం
తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల గురించి ప్రకటనలు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశించింది. ఇప్పటివరకూ ఇచ్చిన ప్రకటనలపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. అంతకుమునుపు, బీజేపీ నేతలు ప్రకాశ్ జవడేకర్, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, సుధాంశు త్రివేది.. కర్ణాటక ప్రభుత్వ చర్యల్ని తప్పుబట్టారు. ఆ రాష్ట్ర సీఎం, మంత్రులపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. 

బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ముఖ్యకార్యదర్శి.. తెలంగాణ వార్తా పత్రికల్లో ప్రకటనలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళి ఎందుకు ఉల్లంఘించారో మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు సంజాయిషీ ఇవ్వాలని కర్ణాటక సీఎస్‌కు నోటీసులు పంపారు. ఈసీ నిబంధనల ప్రకారం, ఎన్నికలు జరగని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం తమ సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వకూడదు.


More Telugu News