​లోకేశ్ కు పిఠాపురంలో ఘనస్వాగతం పలికిన జనసైనికులు

  • పిఠాపురంలో లోకేశ్ యువగళం
  • లోకేశ్ పాదయాత్రకు విశేష స్పందన
  • భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పిఠాపురం పట్టణంలో జనసంద్రాన్ని తలపించింది. కాకినాడ రూరల్ తిమ్మాపురం నుంచి బయలుదేరిన యువగళం పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గం పవర మీదుగా చిత్రాడ వద్ద పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చిత్రాడలో పిఠాపురం ఇంఛార్జి ఎన్వీవీఎస్ వర్మ ఆధ్వర్యంలో లోకేశ్ కు అపూర్వస్వాగతం లభించింది. చిత్రాడలో ప్రధాన ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. 

మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పాదగయ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేశ్ సుమారుగా వెయ్యి మందితో ఫోటోలు దిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగడం పట్ల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. 

పాదగయ క్యాంప్ సైట్ నుండి భోజన విరామానంతరం ప్రారంభమైన పాదయాత్రకు పిఠాపురంలో జనం పోటెత్తారు. పిఠాపురంలో లోకేశ్ కు జనసేన ఇంఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ నేతృత్వంలో జనసైనికులు ఘనస్వాగతం పలికారు. పిఠాపురంలో రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. భవనాలు ఎక్కి లోకేష్ కి జనం అభివాదం చేశారు. యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు.

పెత్తందారు జగన్ కు పేదోడి ఆకలి తెలుస్తుందా?: లోకేశ్

పిఠాపురంలో పాదయాత్ర సందర్భంగా అక్కడి అన్న క్యాంటీన్ వద్ద లోకేశ్ ఆగారు. క్యాంటీన్ కు మూతవేయడం పట్ల సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. "పేదల ఆకలి తీర్చేందుకు పిఠాపురం పాతబస్టాండు సెంటర్ లో గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ఇది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు పోగేసిన జగన్... పేదలు కడుపునిండా అన్నం తినడం ఓర్వలేక అన్న క్యాంటీన్లను రద్దుచేశాడు. 

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ముద్దులు పెట్టి బుగ్గలు నిమరడం, అవసరం తీరిపోయాక పిడిగుద్దులతో హింసించడం జగన్మోహన్ రెడ్డి నైజం. పాపపు సొమ్ముతో ఊరికో ప్యాలెస్ కట్టి లీటర్ వెయ్యి రూపాయల నీళ్లు తాగే పెత్తందారుకు పేదోడి ఆకలి కేకలు వినిపిస్తాయా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2964.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 19.8 కి.మీ.*

*216వ రోజు (3-12-2023) యువగళం వివరాలు*

*పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం*

*ఉదయం*

8.00 – యండపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.30 – కొత్తపల్లి నందివిగ్రహం వద్ద నాయీబ్రాహ్మణులతో సమావేశం.

9.15 – ఉప్పాడ మెయిన్ సెంటర్ లో చేనేతలతో సమావేశం.

9.30 – అమీనాబాద్ సెంటర్ లో మత్స్యకారులతో సమావేశం.

11.00 – మూలాపేట సెంటర్ లో మత్స్యకారులతో భేటీ.

మధ్యాహ్నం 

12.15 – పొన్నాడ శీలంవారి పాకలు జంక్షన్ లో భోజన విరామం.

సాయంత్రం

4.00 – పొన్నాడ శీలంవారి పాకలు జంక్షన్ లో దళిత గళం సభ.

6.00 – పొన్నాడ శీలంవారి పాకలు జంక్షన్ విడిది కేంద్రంలో బస.

******


More Telugu News