అభిమాని కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ‘అన్‌సీన్ పిక్’ పంచుకున్న నాని

  • అభిమాని విజ్ఞప్తి మేరకు ఆసక్తికర ఫొటో పంచుకున్న నాని
  • ఫొటో చూసి మురిసిపోతున్న ఇరువురి ఫ్యాన్స్
  • ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్‌లో భాగంగా నెటిజన్లతో ముచ్చటించిన నాని
అన్ని వర్గాల సినీ అభిమానులను మెప్పించగల తెలుగు సినీ ఇండస్ట్రీ నటుల్లో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్, ‘నేచురల్ స్టార్’ నాని ముందు వరుసలో ఉంటారు. పాత్ర ఎలాంటిదైనా ప్రేక్షకులను కట్టిపడేయగల వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు రాగా.. ‘దసరా’ సినిమా వివిధ భాషల్లో విడుదలవ్వడంతో నాని కూడా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆదరణ కలిగిన ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికను పంచుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. కానీ ఇద్దరినీ ఒకేచోట చూడాలని ముచ్చటపడిన ఓ అభిమాని కోరిక నెరవేర్చాడు నేచురల్ స్టార్ నాని.

ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోని ‘ఎక్స్’ వేదికగా నాని షేర్ చేశాడు. ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని కనిపించిన ఈ పిక్‌ని ఓ అభిమాని విజ్ఞప్తి మేరకు నాని పంచుకున్నాడు. ‘మీది, తారక్ అన్నది అన్‌సీన్ పిక్ చూపించండి ప్లీజ్’ అంటూ ఓ నెటిజన్ ‘ఎక్స్’లో కోరగా నేచురల్ స్టార్ స్పందించాడు. ‘‘ ఇది ఓకే నా?’’ అంటూ ఫొటోని పంచుకున్నాడు. ఈ ఫొటోని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కనుల విందుగా ఉందని సంబరపడుతున్నారు. కాగా ‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆస్క్ నాని’ పేరుతో నెటిజన్లతో సంభాషించాడు. అందులో భాగంగా అభిమాని కోరిక మేరకు ఎన్టీఆర్‌తో ఉన్న ఫొటోని పంచుకున్నాడు.


More Telugu News