అలాంటి వారి పోస్టులపై స్పందించవద్దు: కార్యకర్తలకు ఈటల రాజేందర్ సూచన

  • కొంతమంది చిల్లరగాళ్లు పెట్టే పిచ్చి పొస్టులకు అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దని సూచన
  • ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశాజనక ఫలితాలు వచ్చాయని వెల్లడి
  • 15 శాతం ఓట్లతో 8 సీట్లు, 19 స్థానాలలో రెండో స్థానంలో నిలిచామన్న ఈటల రాజేందర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి వీరే కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది చిల్లరగాళ్లు పెట్టే పిచ్చి పోస్టులకు తన అభిమానులు, కార్యకర్తలు ఏమాత్రం స్పందించవద్దని ఎక్స్ వేదిక ద్వారా సూచించారు. బీజేపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి అభినందనలు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోను బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని అభిప్రాయపడ్డారు.

'భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రతి నాయకునికి, కార్యకర్తకి హృదయపూర్వక అభినందనలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా 15 శాతం ఓట్లు, 8 సీట్లు గెలిచాం. 19 సీట్లలో రెండవ స్థానంలో నిలిచాం.. ఆ స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి. మనలని బలహీనపరచడానికి, అనైక్యత సృష్టించి లాభం పొందాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళ ట్రాప్ లో మనం పడకూడదు. మన లక్ష్యం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించి మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి అందించడం. ఆ దిశగా పనిచేద్దాం తప్ప సోషల్ మీడియాలో చిల్లరగాళ్ళ.. పిచ్చి పోస్టులకు నా అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దు అని మనవి' అని పేర్కొన్నారు.


More Telugu News