రోహిత్ శర్మ బలహీనత ఏంటో చెప్పిన సంజయ్ మంజ్రేకర్

  • ఇవాళ టీమిండియా, దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభం
  • 5 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో అవుటైన రోహిత్ శర్మ
  • వన్డేలు, టీ20ల్లో 'పుల్ షాట్' రోహిత్ ప్రధానాస్త్రం అన్న మంజ్రేకర్
  • టెస్టుల్లో మాత్రం పుల్ షాటే బలహీనతగా మారుతోందని విశ్లేషణ
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ వేరే లెవెల్లో సాగింది. కానీ, టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ కొన్నిసార్లు పేలవంగా అవుటవడం తెలిసిందే. 

ఇవాళ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో కేవలం 5 పరుగులకే అవుటైన రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. రబాడా బౌలింగ్ లో పుల్ షాట్ కొట్టబోయిన 'హిట్ మ్యాన్' ఫైన్ లెగ్ లో దొరికిపోయాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. 

రోహిత్ శర్మకు వన్డేలు, టీ20ల్లో ప్రధాన అస్త్రంగా ఉన్న పుల్ షాట్... టెస్టు క్రికెట్లో మాత్రం శత్రువుగా మారుతోందని అభిప్రాయపడ్డాడు. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైందని తెలిపాడు. 

"రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్లో పుల్ షాట్ ఆడడం మొదలుపెడితే ప్రత్యర్థి జట్లు వెనుకంజ వేస్తుంటాయి. కానీ టెస్టు క్రికెట్ కు వచ్చేసరికి అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. ఆ పుల్ షాటే రోహిత్ శర్మ బలహీనతగా మారుతోంది. గత రెండేళ్లుగా ఆడిన టెస్టులు చూస్తే ఏడు పర్యాయాలు పుల్ షాట్ కొట్టే ప్రయత్నంలోనే రోహిత్ అవుటయ్యాడు. ఇవాళ మాత్రం రోహిత్ ను అవుట్ చేసిన క్రెడిట్ బౌలర్ కు ఇవ్వాల్సిందే. అతడు (రబాడా) చాలా బాగా బౌలింగ్ చేశాడు" అని మంజ్రేకర్ వివరించాడు.


More Telugu News