పవన్ కల్యాణ్ అదొక్కటి మర్చిపోయాడు: మంత్రి కొట్టు సత్యనారాయణ

  • ఏపీలో భారీ కుంభకోణం జరిగిందంటూ ప్రధానికి పవన్ లేఖ
  • సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి
  • పవన్ ఇంటర్ పోల్ ను మర్చిపోయాడంటూ కొట్టు సత్యనారాయణ వ్యంగ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల పేరిట వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని... కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీనిపై వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఇళ్ల కుంభకోణంపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలన్న పవన్ కల్యాణ్ ఇంకొకటి మర్చిపోయాడని, ఇంటర్ పోల్ తో కూడా దర్యాప్తు చేయించాలని అడిగితే బాగుండేదని మంత్రి వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇళ్ల స్థలాల్లో రూ.35 వేల కోట్ల అవినీతి జరిగిందంటున్న పవన్ అందుకు ఆధారాలు చూపించగలరా? అని కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు. వేల కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందని ప్రధాని మోదీ అడిగితే పవన్ ఏం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములేనని, మరి వాటిలో పవన్ కల్యాణ్ కు కూడా భాగం ఉందా? అని కొట్టు సత్యనారాయణ నిలదీశారు. 

చంద్రబాబుకు ఊడిగం చేయడం మానేసి, ముందు మీ పార్టీ నేతలు ఎన్నికల్లో గెలుస్తారో, లేదో అది చూసుకో అంటూ పవన్ కు హితవు పలికారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.


More Telugu News