ప్రయాణికుల సంయమనమే కాపాడింది.. జపాన్ విమాన ప్రమాదం వీడియో!

  • టోక్యో ఎయిర్ పోర్టులో కోస్ట్ గార్డ్ ఫ్లైట్ ను ఢీ కొట్టిన ఎయిర్ బస్ ఏ350
  • ప్రమాద సమయంలో విమానంలో 379 మంది ప్రయాణికులు
  • సిబ్బంది సూచనలను తు.చ. తప్పకుండా పాటించి క్షేమంగా బయటపడ్డ వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఎయిర్ పోర్టులో టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ల్యాండ్ అవుతున్న మరో విమానం ఢీ కొట్టింది. చివరి క్షణంలో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్.. తన ప్రయాణికులను హెచ్చరించాడు. సిబ్బంది సూచనలను పాటించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రమాదం జరుగుతుందని తెలిసినా ప్రయాణికులలో ఒక్కరు కూడా పానిక్ కాలేదు.. భయాందోళనలతో కేకలు పెట్టలేదు. ఫ్లైట్ సిబ్బంది చెప్పిన సూచనలను తు.చ. తప్పకుండా పాటించారు.

ఒకరికొకరు సాయం చేసుకుంటూ అందరూ క్షేమంగా బయటపడ్డారు. జపాన్ లోని టోక్యో ఎయిర్ పోర్టులో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఎయిర్ బస్ ఏ350లోని మొత్తం 379 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే, ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తీసిన వీడియో తాజాగా వెలుగుచూసింది.

పైలట్ హెచ్చరికలు.. ఎయిర్ హోస్టెస్ ల సూచనలు వింటూ ప్రయాణికులు క్రమశిక్షణతో నడుచుకోవడం ఈ వీడియోలో కనిపించింది. వేరే దేశంలో అయితే ప్రయాణికులు భయాందోళనలతో కేకలు వేస్తూ పానిక్ గా మారేవారు. చనిపోతామేమోనని భయంతో ఎలాగైనా బయటపడేందుకు ప్రయత్నించేవారు. మిగతా వారికి సాయం చేయడం అటుంచి వారి గురించి ఆలోచనే చేసేవారు కాదని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రమాదం జరుగుతుందని తెలిస్తే సెల్ ఫోన్లు బయటకు తీసి వీడియోలు తీసేవారని అంటున్నారు. జపాన్ వాసుల క్రమశిక్షణే వారి ప్రాణాలు కాపాడిందని మెచ్చుకుంటున్నారు.



More Telugu News