మంగళగిరి తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న నారా లోకేశ్ భేటీలు

  • మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా లోకేశ్
  • వివిధ రంగాల ప్రముఖులను కలిసి మద్దతు కోరిన వైనం
  • మంగళగిరిని అభివృద్ధి పథంలోకి తీసుకెళదామని పిలుపు
రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలసి రావాలని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేశ్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. 

తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజ లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరరావులను లోకేశ్ నేడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

తొలుత తాడేపల్లి 4వ వార్డులో నివసిస్తున్న దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులు యువనేతను సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్నివర్గాల సహకారం అవసరమని లోకేశ్ అన్నారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. 

అనంతరం తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన ప్రముఖ బీసీ నేత, శ్రీప్రతిభ స్కూలు అధినేత కాజ లక్ష్మీప్రసాద్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీసీల పుట్టినిల్లు అయిన తెలుగుదేశం పార్టీ ద్వారా బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని తెలిపారు. విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొల్లగొడుతూ పేదవిద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. మంగళగిరిని నెం.1గా మార్చే అభివృద్ధి ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని, ఇందుకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. 

తర్వాత తాడేపల్లి 23వ వార్డు మహానాడు కాలనీకి చెందిన బీసీ ప్రముఖుడు డాక్టర్ బుడ్డా సోమేశ్వరరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. సోమేశ్వరరావు ఆర్ఎంపీ డాక్టర్ గా గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సేవలందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యసేవలను విస్తరించేందుకు మీవంటి వారి సహాయ,సహకారాలు అవసరమని లోకేశ్ తెలిపారు. 

ఇప్పటికే ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలను ఏర్పాటుచేసి నియోజకవర్గవ్యాప్తంగా వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మంగళగిరి అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి మీ వంతు సహాయ,సహకారాలు అందించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News