ఇకపై 'జగనన్న గారూ' అనే పిలుస్తా: వైఎస్ షర్మిల

  • జగన్ రెడ్డి గారూ అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడంలేదన్న ఏపీసీసీ చీఫ్
  • రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్
  • జిల్లాల పర్యటనలో భాగంగా పలాసలో బస్సులో ప్రయాణం 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడంలేదని, అందుకే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల.. మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ స్థానిక నేతలతో కలిసి బస్సెక్కిన షర్మిల.. ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, సమస్యల గురించి ఆరా తీశారు.

బస్సు ప్రయాణంలోనే షర్మిల మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికారపార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. వైవీ సుబ్బారెడ్డి గారికి తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదని చెబుతూ.. ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానని సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అభివృద్ధి చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా.. ఏ రోజు.. ఏ సమయంలోనైనా వచ్చి చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూపించే ధైర్యం అధికార పార్టీ నేతలకు ఉంటే వచ్చి చూసేందుకు తమతో పాటు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు, మేధావులు సిద్ధమని వివరించారు.


More Telugu News