మరో పది రోజుల్లో ‘బ్రహ్మోస్ క్షిపణి’ లాంచర్ ల ఎగుమతి: డీఆర్డీవో

  • డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
  • దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు ఎగుమతులపై దృష్టి
  • మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఆర్డీవో చీఫ్ కామత్
రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలను తయారుచేసివ్వడంలో గణనీయమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగానికి అవసరమయ్యే లాంచర్ లను దేశీయంగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. మరో పది రోజుల్లో వీటిని ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన పలు ఉత్పత్తులు త్రివిధ దళాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. దాదాపుగా 4.94 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను ఇప్పటి వరకు ఆర్మీకి అందజేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఉత్పత్తులను అందజేస్తామని తెలిపారు.

గడిచిన ఐదారేళ్లలో రక్షణ శాఖ సమకూర్చుకున్న వివిధ ఉత్పత్తులలో 60 నుంచి 70 శాతం ఉత్పత్తులు డీఆర్డీవో అభివృద్ధి చేసినవేనని డాక్టర్ కామత్ వివరించారు. ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణులను రష్యాతో కలిసి తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్ లను డీఆర్డీవో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, మరో పది రోజుల్లో తొలి కన్ సైన్ మెంట్ పంపించబోతున్నామని వివరించారు. డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ ను నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు.


More Telugu News