సాక్షిలో జగన్ తో పాటు నాక్కూడా సగం వాటా ఉంది: వైఎస్ షర్మిల

  • సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపాటు
  • తనను రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని ఆగ్రహం
  • ఏం పీక్కుంటారో పీక్కోండని తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షి మీడియాలో జగన్ తో సమానంగా తనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్సార్ సాక్షిలో జగన్ కు, తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదని షర్మిల అన్నారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్న అని... సీఎం అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని చెప్పారు. రక్తం పంచుకుని పుట్టిన తనపై... రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా... అత్యంత నీచంగా ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఎవరెంత చేసినా భయపడే ప్రసక్తే లేదని... ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కడప తాను పుట్టిన ఇల్లు అని షర్మిల అన్నారు. జగన్ మాదిరి తాను కూడా ఇక్కడే పుట్టానని, జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని చెప్పారు. జగన్ కు, పార్టీకి తాను చేసిన సేవలు వైసీపీ క్యాడర్ కు గుర్తులేవన్నారు. తన మీద రోజుకొక కథ అల్లుతున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు రోజుకొక జోకర్ ను తెస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని అన్నారు. విలువలు, విశ్వసనీయతలు మీకు లేవా? అని ప్రశ్నించారు. తాను రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిలారెడ్డినని... ఇదే తన ఉనికి అని చెప్పారు.


More Telugu News