తన బాగోతం బయటపడుతుందనే సీఎం మమ్మల్ని సస్పెండ్ చేయించారు: బుచ్చయ్య చౌదరి

  • నిత్యావసరాల ధరలపై సభలో చర్చకు పట్టుబట్టినట్లు వెల్లడి
  • స్పీకర్ వెన్నెముక లేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శ 
  • ప్రజల కోసం గొంతెత్తితే అన్యాయంగా సస్పెండ్ చేశారని మండిపడ్డ టీడీపీ
  • అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో బుచ్చయ్య చౌదరి, నిమ్మల
రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరలపై సభలో చర్చిస్తే తన బాగోతం బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ తమను సస్పెండ్ చేయించారని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ వెన్నెముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదం అన్నట్లు సభ నడుపుతున్నారని విమర్శించారు. తమ కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని వారే సస్పెండ్ చేస్తారని అన్నారు. ఆ రోజు దగ్గర్లోనే ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి అన్నారు.

‘జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచారు. ప్రభుత్వం విధించే పన్నులు చెల్లించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసి సీఎం జగన్ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. స్థానిక సంస్థల అభివృద్ధి నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేంద్ర చట్టాలను తుంగలో తొక్కి వేలకోట్లను రాష్ట్ర ఖజానాకు మళ్లించారు. అమృత్, జల్ జీవన్ మిషన్ కు కేటాయించిన నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకుండా పంచాయతీలను, సర్పంచ్ లను నిస్సహాయ స్థితిలోకి నెట్టారు. ప్రభుత్వ పోకడతో స్థానికంగా అభివృద్ధి పనులు చేయలేక, ప్రజలకు జవాబు చెప్పలేక సర్పంచ్ లు ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. సొంతపార్టీకి చెందిన సర్పంచ్ లే అయినా నిధులు ఇవ్వకుండా వాలంటీర్లతో పెత్తనం చేయిస్తూ పంచాయతీలలో ఎలాంటి అభివృద్ధికి అవకాశమే లేకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. ఆఖరికి బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేక సర్పంచ్ లు ఏమిటి మాకీ ఖర్మ అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేసి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి’ అని బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.

సర్పంచ్ ల పై లాఠీఛార్జ్ అమానుషం..
న్యాయం చేయాలంటూ సర్పంచ్ లు ఆందోళనకు దిగితే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించారని ప్రభుత్వంపై బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ అనుబంధ విభాగంగా మార్చారని ఆరోపించారు. వైసీపీ సభలకు జనం రాకుంటే వాలంటీర్లతో బెదిరించి మరీ తరలిస్తున్నారని సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందికి కూడా జనసమీకరణ బాధ్యతలు అప్పగిస్తున్నాడని అన్నారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చి, నియంత్రత్వ పోకడలు పోతున్న ఈ ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కొన్ని నెలలుగా ఉద్యమిస్తున్న స్థానిక సంస్థల ఉద్యోగుల ఆంశంపై చర్చించేందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వడంలేదని జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. దాదాపు ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ ప్రతిపక్షాలకు ఉభయ సభలలో ఎన్నిసార్లు, ఎంత సమయం ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఇంకా ఎన్నాళ్లు మా గొంతులు నొక్కేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ కూడా వెన్నెముక లేకుండా, ముఖ్యమంత్రి చెప్పిందే తనకు వేదం అన్నట్లు ప్రవర్తిస్తున్నాడని బుచ్చయ్య చౌదరి రోపించారు.

ఈ స్థాయి బందోబస్తు ఏనాడైనా చూశామా..
తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్ నుంచి అసెంబ్లీ వరకు కనీసం 4 వేల మంది పోలీసులు ఉన్నారని, అసెంబ్లీ ప్రాంగణంలో ఇంతమంది పోలీసులను ఏనాడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇంత పిరికి సన్నాసి ముఖ్యమంత్రిని, ప్రజలకు భయపడే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. గొప్ప పాలన అందిస్తే ఇన్నివేల మంది పోలీసులను ఎందుకు కాపలా పెట్టుకున్నారని జగన్ ను ప్రశ్నించారు. బిర్యానీలు, మద్యం పంచినా, డబ్బులిచ్చినా సీఎం సభలకు జనం రావట్లేదని అన్నారు. దీంతో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి జనాలను తరలిస్తున్నారని అధికార పార్టీపై మండిపడ్డారు. మొన్న జరిగిన ఒకసభకు 5 జిల్లాల నుంచి జనాన్ని తరలించారు. కానీ జగన్ ప్రసంగించే సమయానికి అక్కడ పట్టుమని 20వేల మంది కూడా లేరు. ప్రజల్లో జగన్ పై ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడే అర్థమవుతోంది. జగన్ రెడ్డి తన రాజకీయ పబ్బంకోసమే ఉత్తుత్తి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు.. విధులులేకుండా తనకు భజన చేసేవారిని చైర్మన్లుగా నియమించారని ఆరోపించారు. దుర్మార్గపు ముఖ్యమంత్రి రాక్షస పాలన అంతం అయితేనే స్థానిక సంస్థలకు మరలా మంచిరోజులు వస్తాయని బుచ్చయ్య చౌదరి చెప్పారు.

సర్పంచ్ ల పోరాటానికి టీడీపీ మద్దతు 
శాసన సభ నుంచి సస్పెండ్ చేయొచ్చు కానీ ప్రజల కోసం చేస్తున్న తమ పోరాటాన్ని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి గుర్తించాలని బుచ్చయ్య చౌదరి చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్లి, ప్రజా పోరాటంతోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెబుతామని అన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న సర్పంచ్ లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు టీడీపీ అండగా ఉంటుందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. 

ప్రజలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు: నిమ్మల రామానాయుడు
జగన్ పాలనలో ప్రజలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు నిత్యావసరాలకు రూ.2 వేలు ఖర్చయితే, ఇప్పుడు రూ.8 వేలు ఖర్చవుతున్నాయని అన్నారు. జగన్ ధరలు పెంచడంతో ఒక్కో పేద కుటుంబంపై ఏడాదికి రూ.60 వేల భారం పడిందని ఆరోపించారు. దీనిపై సభలో చర్చ చేపట్టాలంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని చెప్పారు. పేదల పక్షాన మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ధరల మోత – పన్నుల వాత ఇదే జగన్ మార్క్ పాలన అని విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల పాపం కేంద్రానిదే అంటూ జగన్ తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అయితే, పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్నును 32 శాతం నుంచి 35 శాతానికి జగన్ సర్కారే పెంచిందని గుర్తుచేశారు.

చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం..
బియ్యం, పప్పు, నూనె సహా నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయని, కరెంట్ బిల్ ను జగన్ తొమ్మిదిసార్లు పెంచారని రామానాయుడు చెప్పారు. మద్యాన్ని నిషేధిస్తానని మహిళలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక అధిక ధరలకు మద్యం అమ్ముతూ పేదల బతుకులతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఆస్తిపన్ను, నీటిపన్ను, మరుగుదొడ్లపై పన్ను అంటూ ఆఖరికి చెత్తపై కూడా పన్నులు వేసిన ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వంగా పేరు పొందిందని ఎద్దేవా చేశారు. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించాలని పట్టుబట్టినందుకు తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిమ్మల రామానాయుడు అన్నారు.


More Telugu News