వరుసగా రెండో ఏడాది ఎస్ఏ20 లీగ్ విజేతగా సన్ రైజర్స్... కావ్యా మారన్ ఆనందం అంతా ఇంతా కాదు!

  • ఐపీఎల్ గత కొన్ని సీజన్లుగా అంతంతమాత్రంగా ఆడుతున్న సన్ రైజర్స్
  • దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం అదరగొడుతున్న సన్ రైజర్స్
  • నిన్న జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్స్ పై ఘనవిజయం
  • 2023లోనూ టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
భారత్ లో నిర్వహించే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గురించి తెలిసిందే. ప్రతిభావంతులకు కొదవలేనప్పటికీ గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. 2023 సీజన్ లో మరీ దారుణంగా ఆడారు. కానీ, అది ఐపీఎల్ వరకే! 

సన్ రైజర్స్ యాజమాన్యానికి దక్షిణాఫ్రికా టీ20 టోర్నీ ఎస్ఏ20 లీగ్ లోనూ ఓ జట్టు ఉంది. ఆ టీమ్ పేరు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు నాయకత్వం వహించే ఐడెన్ మార్క్ క్రమ్ ఈ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు కూడా కెప్టెన్. అతడి నాయకత్వంలోనే ఎస్ఏ20 లీగ్ లో 2023 సీజన్ టైటిల్ నెగ్గిన సన్ రైజర్స్, ఈ ఏడాది కూడా కుమ్మేసింది. 

నిన్న కేప్ టౌన్ లో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల భారీ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ పై ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ తొలుత 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. జోర్డాన్ హెర్మన్ 42, అబెల్ 55, కెప్టెన్ మార్ క్రమ్ 42 (నాటౌట్), ట్రిస్టాన్ స్టబ్స్ 56 (నాటౌట్) పరుగులతో అదరగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ ను సన్ రైజర్స్ బౌలర్లు 17 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూల్చారు. యువ ఆల్ రౌండర్ మార్కో యన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీయడం హైలైట్. 

ఇదంతా ఒకెత్తయితే... సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ ఆనందం మరో ఎత్తు. భారత్ లో తమ జట్టు ఆపసోపాలు పడుతున్న వేళ... దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు టైటిళ్లు గెలవడంతో అమ్మడి సంతోషం అంబరాన్నంటుతోంది. 

డర్బన్ జట్టు చివరి వికెట్ కోల్పోగానే కావ్యా మారన్ చిన్న పిల్లలా గంతులేశారు. సన్ రైజర్స్ ఆటగాళ్లతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ట్రోఫీని పట్టుకుని మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


More Telugu News