వెళ్లి కెప్టెన్ రోహిత్ శర్మకు చెప్పు.. డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌కు అనిల్ కుంబ్లే కీలక సలహా

  • లెగ్ స్పిన్ బౌలింగ్‌ను విడిచిపెట్టొద్దని సూచన
  • కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని రోహిత్ శర్మ ను అడగమని సూచన
  • బౌలింగ్‌కు సిద్ధంగా ఉండాలని రోహిత్ కోరాడని, శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు వెల్లడించిన జైస్వాల్
స్వదేశంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలతో సెన్సేషనల్‌గా మారిపోయాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్‌కు టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కీలక సూచన చేశారు. 

‘‘ నువ్వు చాలా బాగా బ్యాటింగ్ చేశావు. కానీ నీలో నేను గమనించిన ఒక విషయం ఉంది. నువ్వు సహజసిద్ధంగా లెగ్ స్పిన్ చేయగలవు. దానిని అలాగే కొనసాగించు. వదులుకోవద్దు. ఎందుకంటే ఈ బౌలింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. నువ్వు లెగ్ స్పిన్ బౌలింగ్ బాగా చేస్తావని నాకు తెలుసు. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వమని కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకి వెళ్లి చెప్పు’’ అని అనిల్ కుంబ్లే సూచించారు. మ్యాచ్ అనంతరం ‘జియో స్పోర్ట్స్’తో మాట్లాడిన జైస్వాల్‌కు కుంబ్లే ఈ సలహా ఇచ్చారు.

కుంబ్లే సలహాపై జైస్వాల్ స్పందిస్తూ... ‘‘ఈ సిరీస్‌లో బౌలింగ్ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ నాకు చెప్పాడు. అందుకే బౌలింగ్ శిక్షణను కొనసాగిస్తున్నాను. రోహిత్ సిద్ధంగా ఉండమని చెప్పడంతో ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాను’’ అని అనిల్ కుంబ్లేకి జైస్వాల్ బదులిచ్చాడు. కాగా జైస్వాల్ అప్పుడప్పుడు లెగ్-స్పిన్ బౌలింగ్ చేస్తుంటాడు. రాజ్‌కోట్ టెస్టులో మూడవ రోజు అశ్విన్ అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉండాలని సూచించడంతో ట్రైనింగ్ సెషన్‌లో జైస్వాల్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కాగా రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై జైస్వాల్ 214 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా 434 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.


More Telugu News