ఒక్కో సభ నుంచి టీడీపీని ఖాళీ చేయిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి

  • రాజ్యసభలో టీడీపీని తుడిచి పెట్టేశామన్న సుబ్బారెడ్డి
  • రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • టీడీపీ, జనసేనలో ఉన్నవారికి మనుగడ ఉండదన్న సుబ్బారెడ్డి
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని తుడిచి పెట్టేశామని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పారు. ఒక్కో సభ నుంచి టీడీపీని ఖాళీ చేస్తున్నామని... వచ్చే ఎన్నికల్లో లోక్ సభ, శాసనసభలో కూడా టీడీపీని ఖాళీ చేయిస్తామని అన్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సుబ్బారెడ్డి... రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. 

ఈ సందర్భంగా విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ యత్నించిందని... కానీ, తమ ఎమ్మెల్యేలు జగన్ పట్ల పూర్తి విధేయతతో ఉండటంతో వారి ప్రయత్నాలు నెరవేరలేదని అన్నారు. 

టీడీపీ, జనసేనల ప్రలోభాలతో వైసీపీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు... మళ్లీ సొంత గూటికి తిరిగొస్తున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ లో ఉన్న నేతలకు మనుగడ ఉండదని అన్నారు. జగన్ తో పాటు ఉంటేనే రాజకీయంగా ఎవరికైనా మంచి జరుగుతుందని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, గొల్ల బాబూరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


More Telugu News