మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలన్న ప్రతిపాదనపై కిషన్ రెడ్డి స్పందన

  • మేడారం జాతరకు వచ్చిన కిషన్ రెడ్డి
  • సమ్మక్క-సారలమ్మల దర్శనం
  • నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పణ
  • జాతీయ పండుగ విధానం ఎక్కడా లేదని వెల్లడి 
  • మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు సాధ్యం కాదని వివరణ
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. 

కాగా, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలామంది అడుగుతున్నారని, అయితే, జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని, అందువల్ల మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు. 

ఇక, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం టెంపరరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది అమ్మవార్ల దయగానే భావిస్తామని తెలిపారు. ఈ ట్రైబల్ వర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు. వర్సిటీ భవనాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని, ఈ ఏడాదే ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. వర్సిటీలో అధిక భాగం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారని స్పష్టం చేశారు.


More Telugu News