బీఆర్ఎస్‌కు మరోషాక్.. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్!

  • ఊహాగానాలు నిజం చేస్తున్న ఆరూరి రమేశ్
  • ఫలించని కేసీఆర్, కేటీఆర్ మంతనాలు
  • బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వజూపినా పార్టీ మారేందుకే మొగ్గు
  • నేటి సాయంత్రం ఢిల్లీలో బీజేపీ తీర్థం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒకదాని తర్వాత ఒకటిగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల్లో కొందరు ‘కారు’దిగి ‘చేయి’ అందుకుంటుంటే, మరికొందరు ‘కమలం’ గూటికి చేరుతున్నారు. తాజాగా, మరోనేత బీజేపీలో చేరికకు రంగం సిద్దమైంది. వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించిన రమేశ్.. ఇటీవలి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గుచూపినా ఆ తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపు అసాధ్యమని భావించి కారు దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 4,5 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన సమయంలోనే ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే, విషయం తెలిసి పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఒత్తిడి పెంచడంతోపాటు కడియం శ్రీహరి వంటి నేతలు బుజ్జగించడంతో చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. 

ఇప్పుడు మాత్రం పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. విషయం తెలిసి పార్టీ నేతలు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని తెలిసింది. నేటి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్న ఆయన సాయంత్రం కేంద్రం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పార్టీ చేరికపై ఇప్పటికే అనుచరులు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలిసింది.


More Telugu News