విద్యుత్ ఆధారిత వాహనాల నూతన విధానానికి కేంద్రం ఆమోదం

  • దేశంలో కొత్త ఈవీ పాలసీ ప్రకటించిన కేంద్రం
  • దేశీయంగా విద్యుత్ వాహన తయారీని ప్రోత్సహించడమే లక్ష్యం
  • ప్రభుత్వం ఎంపిక చేసిన ఈవీ కంపెనీలకు పన్ను రాయితీలు
  • అదే సమయంలో పలు నిబంధనలు విధించిన కేంద్రం
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత్ ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. విద్యుత్ ఆధారిత వాహన తయారీ రంగంలో నూతన విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రపంచ అగ్రగామి విద్యుత్ వాహన సంస్థలు దేశీయంగానే తమ వాహనాలు తయారుచేసేలా ప్రోత్సహించడమే ఈ నూతన ఈవీ పాలసీ ముఖ్య ఉద్దేశం. 

ఈ క్రమంలో తాజా పాలసీ కింద విద్యుత్ వాహన తయారీ పరిశ్రమలకు కేంద్రం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. భారత్ ను ఈవీ తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని కేంద్రం పేర్కొంది. భారత్ లో ఆయా కంపెనీలు మూడేళ్లలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిబంధన విధించారు. ఐదేళ్లలో 50 శాతం విద్యుత్ వాహనాలను స్థానికంగానే తయారుచేయాలని ఈ నూతన విధానంలో స్పష్టం చేశారు. 

తాజా ఈవీ పాలసీలో... ఆయా కంపెనీలు డీవీఏ ప్రమాణాలకు లోబడి బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక, ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీలకు దిగుమతి పన్ను మినహాయింపు లభిస్తుంది. 

టెస్లా వంటి అగ్రశ్రేణి విద్యుత్ వాహన తయారీ సంస్థలకు ఈ నిర్ణయం లాభిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. భారత్ లో కాలుమోపడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టెస్లాకు ఈ నిర్ణయంతో మార్గం సుగమం కానుంది.


More Telugu News