పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కీలక సమావేశం

  • ఏపీలో వాలంటీర్లకు బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం
  • వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
  • పెన్షన్లు ఎలా అందించాలన్న దానిపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
  • ఈ రాత్రికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని జవహర్ రెడ్డి వెల్లడి 
పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో, పెన్షన్లు ఎలా అందించాలన్నదానిపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీపై కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. 

ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయొచ్చని పలువురు కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేయొచ్చని వారు సూచించారు. వారంలో పింఛన్ల పంపిణీ పూర్తి చేయవచ్చని మరికొందరు కలెక్టర్లు తెలిపారు. 

గ్రామాల్లో ఇంటింటికీ పింఛను పంపిణీకి ఇబ్బంది లేదని, కానీ పట్టణాలు, నగరాల్లోనే ఇంటింటికి పింఛను పంపిణీ కొంచెం కష్టమని కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రామ/వార్డు సచివాలయాల వద్దే పింఛన్లు పంపిణీ చేసేట్టయితే ఆ మేరకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లు పేర్కొన్నారు. 

అనంతరం, సీఎస్ జవహర్ రెడ్డి స్పందిస్తూ, ఈ రాత్రికి పింఛన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని చెప్పారు.


More Telugu News