ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ కెప్టెన్ రిషభ్ పంత్‌కు ఊహించ‌ని షాక్‌.. మ‌రోసారి భారీ జ‌రిమానా!

  • రిషభ్ పంత్‌కు రూ. 24 ల‌క్ష‌ల జ‌రిమానా
  • స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగానే ఫైన్ వేసిన‌ట్లు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ప్రకటన 
  • నిన్న వైజాగ్‌ వేదిక‌గా కేకేఆర్‌, డీసీ మ‌ధ్య‌ మ్యాచ్‌
  • 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ ఘోర ఓట‌మి 
ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) సార‌ధి రిష‌భ్ పంత్‌కు మ‌రోసారి భారీ జ‌రిమానా ప‌డింది. బుధ‌వారం విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-బీడీసీఏ క్రికెట్ స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అత‌డికి రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. "మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన రెండో త‌ప్పిదం కావడంతో పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించడం జ‌రిగింది" అని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ త‌న‌ ప్రకటనలో పేర్కొంది. 

అలాగే సార‌ధి పంత్‌తో పాటు ఈ మ్యాచ్‌లో తుదిజ‌ట్టులోని ఢిల్లీ ఆట‌గాళ్లంద‌రికీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ అభిషేక్ పోరెల్‌ స‌హా ఒక్కొక్క‌రికి రూ. 6 ల‌క్ష‌ల జ‌రిమానా లేదంటే.. మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఈ రెండింటీలో ఏది త‌క్కువ‌గా ఉంటే అది) కోత ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఇక ఈ మ్యాచ్‌లో డీసీని కేకేఆర్ 106 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించిన విష‌యం తెలిసిందే. కేకేఆర్ నిర్దేశించిన 273 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో ఢిల్లీ త‌డ‌బ‌డింది. 

కెప్టెన్ పంత్ (55), స్ట‌బ్స్ (54) మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఢిల్లీ 17.2 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వైభ‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మిచెల్ స్టార్క్ 2, ర‌సెల్‌, సునీల్ న‌రైన్ త‌లో వికెట్ తీశారు. కాగా, ఇదే వేదిక‌పై గ‌త ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఢిల్లీ కెప్టెన్ రిష‌భ్ పంత్‌కు రూ.12 ల‌క్ష‌ల ఫైన్ ప‌డిన విష‌యం తెలిసిందే.


More Telugu News