ఎన్నికల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత పోటీ.. కూరగాయలు అమ్ముతూ ప్రచారం

  • తమిళనాడు తిరుచిరాపల్లి లోక్‌సభ స్థానం బరిలో నిలిచిన ఎస్. దామోదరన్
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వైనం
  • పారిశుధ్య రంగంలో 40 ఏళ్ల అనుభవం, పద్మశ్రీ అవార్డుకు ఎంపిక
  • పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరిసే నగరంగా తిరుచ్చీని తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని వెల్లడి
ఎన్నికల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత పోటీ.. కూరగాయలు అమ్ముతూ ప్రచారం
దేశంలో ప్రధాన పార్టీలు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న వేళ స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ శక్తిమేరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తమిళనాడులోని తిరుచిరాపల్లి లోక్‌సభ స్థానంలో బరిలోకి దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్. దామోదరన్ కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. 

స్థానిక మార్కెట్ వద్ద ఉద్ధృత ప్రచారం నిర్వహిస్తున్న ఎస్ దామోదరన్.. తనకు ఓటు వేయాలంటూ అక్కడి వీధి వ్యాపారులు, సామాన్యులను అర్థిస్తున్నారు. వ్యాపారులతో కలిసి కూరగాయలు, పూలు అమ్ముతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పారిశుద్ధ్యంపై విశేష కృషి చేసిన ఎస్. దామోదరన్.. రెండేళ్ల క్రితం అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 

‘‘తిరుచ్చి నుంచి నేను బరిలోకి దిగాను. నేను ఇక్కడ పుట్టిన వాడిని. ఈ నగరానికి చెందిన వాడిని. గత నలభై ఏళ్లుగా నేను పారిశుద్ధ్య వాలంటీర్‌గా పనిచేస్తున్నాను. 21 ఏళ్ల వయసప్పుడు నా కెరీర్ ప్రారంభించా. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. 60 ఏళ్ల వయసులో నాకు పద్మశ్రీ లభించింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

పచ్చదనం వెల్లివిరిసే పరిశుభ్రమైన నగరంగా తిరుచ్చీని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎస్.దామోదరన్ తెలిపారు. నగరానికి ఓ రింగ్ రోడ్డు కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఫ్లైఓవర్లు కోరుతున్నారని అన్నారు. తనను గెలిపిస్తే ఈ ప్రాజెక్టుల సాకారం కోసం కృషి చేస్తానని తెలిపారు.


More Telugu News