ఇక టాలీవుడ్ లో కొనసాగే హవా ఈ కేరళ బ్యూటీలదే!

  • మలయాళ కథలకు పెరుగుతున్న ఆదరణ 
  • సరైన కథల కోసం వెయిట్ చేస్తున్న అనిక 
  • 'నేరు'తో ఆకట్టుకున్న అనశ్వర రాజన్ 
  • 'ప్రేమలు'తో మమితకు పెరిగిపోయిన డిమాండ్  

ఈ మధ్య కాలంలో తెలుగులో మలయాళ సినిమాల జోరు పెరిగింది. నిన్నమొన్నటి వరకూ అక్కడి సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పుణ్యమా అని అక్కడి ఆర్టిస్టులు ఇక్కడి ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ఈ కారణంగానే అక్కడి అనువాదాలకు ఇక్కడ మంచి డిమాండ్ పెరిగింది. ఆ సినిమాలు మలయాళ టైటిల్ తోనే ఇక్కడ విజయాలను అందుకుంటూ ఉండటం విశేషం. 

తెలుగు తెరపైకి ఒక వైపు నుంచి బాలీవుడ్ భామలు .. మరో వైపు నుంచి కోలీవుడ్ బ్యూటీలు వరదలా వచ్చిపడుతున్నా, టాలీవుడ్ ఇప్పుడు ఎక్కువగా మల్లూవుడ్ హీరోయిన్స్ వైపు దృష్టిపెడుతోంది. మలయాళంలో ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ జాబితాలో అనిక సురేంద్రన్ .. అనశ్వర రాజన్ .. మమిత బైజు పేర్లు ముందు వరుసలో కనిపిస్తున్నాయి. అనిక సురేంద్రన్ ఆల్రెడీ ఇక్కడ 'బుట్టబొమ్మ' చేసి, యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది.ఇక్కడ నుంచి ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వెళుతూనే ఉన్నాయి. అయితే సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఆమెనే స్వయంగా చెప్పింది. ఇక 'నేరు' సినిమాతో అనశ్వర రాజన్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక్కడి యంగ్ హీరోలు కొంతమంది ఈ బ్యూటీని సిఫార్స్ చేస్తున్నట్టు సమాచారం. నటన ప్రధానమైన పాత్రలలో జీవించగల సత్తా అనశ్వరకి ఉంది. తెలుగు తెరపై ఈ అమ్మాయి కనిపించే సమయం మరెంతో దూరంలో లేదు. 

ఇక మమిత బైజు విషయానికి వస్తే, ఇప్పటికే 15 సినిమాల వరకూ చేసినా, 'ప్రేమలు' మాత్రమే ఆమెకి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. 'ప్రేమలు' తరువాత టాలీవుడ్ మేకర్స్ లో చాలామంది ఆమెను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓటీటీల్లోనూ వీరి సినిమాలకి ఒక రేంజ్ లో వ్యూస్ వస్తుండటంతో, తెలుగులో ఈ ముగ్గురు కేరళ బ్యూటీల హవా మొదలుకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News