ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... 18 మంది మావోల మృతి

  • కాంకేర్ జిల్లాలో కాల్పుల మోత
  • పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలు
  • కాల్పులు ప్రారంభించిన నక్సల్స్
  • దీటుగా స్పందించిన బీఎస్ఎఫ్, డీఆర్జీ దళాలు
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు భారీ నష్టం వాటిల్లింది. భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లాలోని బినాగుండ అటవీప్రాంతం ఇవాళ కాల్పుల మోతతో దద్దరిల్లింది. 

పెద్ద సంఖ్యలో మావోలు బినాగుండ ప్రాంతంలో ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) దళాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. అయితే, భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోలు కాల్పులు ప్రారంభించారు. బీఎస్ఎఫ్, డీఆర్జీ దళాలు కూడా దీటుగా స్పందించి ఎదురుకాల్పులకు దిగాయి. 

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 18 మంది నక్సల్స్ హతులయ్యారు. ఓ బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ కు, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నక్సల్స్ వైపు ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం.


More Telugu News