అవి డ్రోన్లు కాదు.. పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి: ఇరాన్ ఎద్దేవా

  • గురువారం రాత్రి జరిగిన దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి
  • ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు తేలలేదన్న ఇరాన్ విదేశాంగ మంత్రి
  • ఇరాన్ ప్రతీకారానికి దిగితే ప్రతిస్పందన గరిష్ఠ స్థాయిలో ఉంటుందని హెచ్చరిక
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తమ దేశంలో జరిగిన దాడిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు రుజువు కాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అమిరాబ్‌డొల్లాహియా తెలిపారు. డ్రోన్‌లు ఇరాన్‌లోనే గాల్లోకి లేచాయని, కొన్ని మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత వాటిని కూల్చివేశామని చెప్పారు. అవి పిల్లలు ఆడుకునే బొమ్మల మాదిరిగా ఉన్నాయని, డ్రోన్‌లు కాదని చెప్పారు. వీటికి ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నట్టు రుజువు కాలేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు కచ్చితమైనవి కావని ఆయన తెలిపారు.

తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ప్రతీకారానికి దిగితే ఇరాన్ తదుపరి ప్రతిస్పందన తక్షణమే ఉంటుందని, అదో కూడా గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అమిరాబ్‌డొల్లాహియా హెచ్చరించారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్ ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌ నగరంపై మూడు డ్రోన్‌లను ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసిందని ఇరాన్ మీడియా, ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తక్కువ సంఖ్యలో పేలుళ్లు జరిగాయని తెలిపాయి. అయితే ఈ దాడులు ఇజ్రాయెల్ చేయలేదని, చొరబాటుదారుల పని అని చెబుతున్నారు.

కాగా ఇస్ఫాహాన్ నగరానికి సమీపంలోనే ఉన్న ఇరాన్ వైమానిక దళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందంటూ శుక్రవారం ఉదయం కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. అమెరికా ఎలాంటి ప్రమాదకర కార్యకలాపాలలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న సిరియాలోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయెల్ పనేనంటూ ఇటీవలే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. వీటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ సరైన సమయంలో తగు విధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.


More Telugu News