రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన జగ్గారెడ్డి

  • లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నోటీసుల డ్రామాకు తెరలేపిందని ఆగ్రహం
  • ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ నాటకాలు అని ఆరోపణ
  • బీఆర్ఎస్‌కు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని జోస్యం
అమిత్ షా పేక్ వీడియో కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసుల నోటీసుల అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నోటీసుల డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. బీజేపీకీ ఇప్పుడు సీట్ల భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ నాటకాలు అన్నారు. ఈ నోటీసులపై లీగల్‌గా ఫైట్ చేస్తామన్నారు. రాజ్యాంగం అవసరమా? అని బీజేపీ నేతలు చర్చ పెట్టలేదా? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణ ఉంటుందన్నారు. మాటలు చెప్పి మోసం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. ఎప్పుడో ఏడాదికో... అయిదేళ్లకో ఓసారి బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడుతారని విమర్శించారు. ఇప్పుడు ఓటమి భయంతో బస్సుయాత్ర చేస్తున్నారన్నారు. ఓ వైపు ఎండల కారణంగా కేసీఆర్ ఆగమాగం చేస్తుంటే మరోవైపు ఢిల్లీ పోలీసులను పంపి బీజేపీ ఆగమాగం చేస్తోందన్నారు.


More Telugu News