వీధి కుక్క, లోకో పైలట్ బంధం చూసి నెటిజన్ల ఫిదా

  • స్టేషన్ కు రైలు చేరుకుంటున్న వేళ ప్లేట్ లో ఆహారంతో రెడీగా ఉన్న లోకో పైలట్
  • అతన్ని దూరం నుంచే చూసి తోక ఆడిస్తూ గుర్తుపట్టిన శునకం
  • ప్లాట్ ఫాం పై రైలును అనుసరిస్తూ పరుగు.. వైరల్ గా మారిన క్లిప్పింగ్
విశ్వాసానికి మారు పేరైన కుక్కలు కాస్త తిండే పెట్టే వారు కనిపించగానే తోక ఆడిస్తూ తమ కృతజ్ఞత చాటుతాయి. ఓ రైల్వే స్టేషన్ సాక్షిగా ఇదే విషయం మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో ఓ రైలు స్టేషన్ కు చేరుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో అందులోని లోకో పైలట్ తన చేతిలో బన్ ముక్కలు ఉన్న ప్లేట్ పట్టుకున్నాడు. ప్లాట్ ఫాం సమీపంలోకి రైలు రాగానే అక్కడే నిలబడి ఎదురుచూస్తున్న ఓ వీధికుక్క లోకో పైలట్ ను గుర్తుపట్టింది. వెంటనే తోక ఆడిస్తూ ముందుకు పరుగు తీసింది. ఆ రైలు ఎక్కడ ఆగుతుందో తెలుసు అన్నట్లుగా రైలును అనుసరించింది. మధ్యలో అక్కడక్కడా ప్రయాణికులు ఉన్నా వారెవరికీ ఇబ్బంది కలిగించకుండా కాస్త దూరం నుంచి పరిగెట్టింది. చివరకు ప్లాట్ ఫాం మీద రైలు ఆగాక లోకో పైలట్ కిందకు దిగి దానికి ఆహారం అందించాడు. అయితే ఎందుకో తెలియదు కానీ తోక ఆడిస్తూనే కాస్త భయభయంగా కనిపించింది. అంతటితో వీడియో అర్ధంతరంగా ముగిసింది.

ఈ వీడియోను ప్రముఖ సామాజిక వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకున్న ఓ నెటిజన్ ఆ కుక్క ఉత్సాహం గురించి తెలియజేశాడు. రైలు లోకో పైలట్, ఇంజనీర్ తరచూ దానికి ఆహారం అందిస్తారని చెప్పాడు. ‘ఒకసారి దానికి లోకో పైలట్ ఆహారం అందించడంతో అప్పటి నుంచి అది ఆ రైలును గుర్తుపెట్టుకుంది. దాని సంతోషాన్ని చూస్తే ముచ్చటేస్తోంది. ఎవరూ కూడా అన్ని జీవులను సంతోషంగా ఉంచలేరు. కానీ దయ, కరుణ ఒక జీవిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాయి’ అని ఆ నెటిజన్ పేర్కొన్నాడు.

ఈ వీడియో క్లిప్ కు ఏకంగా 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే 56 వేలకు పైగా లైక్ లు లభించాయి. మే ఒకటో తేదీన ఈ వీడియోను పోస్టు చేయగా దాన్ని ఏ ప్రాంతంలో తీశారో తెలియరాలేదు. వీడియోను చూసిన నెటిజన్లు వీధి కుక్కకు, లోకో పైలట్ కు మధ్య ఏర్పడిన అనుబంధాన్ని చూసి ఫిదా అయ్యారు. ఆ కుక్కను లోకో పైలట్ పెంచుకుంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడగా మరికొందరు మాత్రం వీధి కుక్కలు స్వేచ్ఛగా తిరిగేందుకే ఇష్టపడతాయని కామెంట్ పోస్ట్ చేశారు.


More Telugu News