మ‌రికాసేట్లో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌..​ కోహ్లీ భద్రతకు ముప్పు.. భారీ సెక్యురిటీ!

  • నేడు అహ్మ‌దాబాద్‌లో ఆర్ఆర్‌, ఆర్‌సీబీ ఎలిమినేటర్ మ్యాచ్‌
  • ఎలిమినేటర్ మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెష‌న్‌ను క్యాన్సిల్ చేసుకున్న ఆర్‌సీబీ  
  • కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే ఆర్‌సీబీ యాజమాన్యం నిర్ణయం
  • మంగ‌ళ‌వారం సాయంత్రం జరగాల్సిన మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించని ఇరు జట్లు
అహ్మ‌దాబాద్‌లో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) తో జరగనున్న ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఉన్న ఏకైక ప్రాక్టీస్ సెషన్ తోపాటు మీడియా సమావేశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రద్దు చేసుకుంది. జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే ఆర్‌సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంద‌ని స‌మాచారం. ఇవాళ్టి ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు గుజ‌రాత్ కాలేజీ గ్రౌండ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు మంగ‌ళ‌వారం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. కానీ, అది కాస్తా క్యాన్సిల్ అయింది.  

ఆనందబజార్ పత్రిక ప్రకారం.. ఆర్‌సీబీ ప్రాక్టీస్ చేయకపోవడానికి కారణం ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండటం. ఇందుకు సంబంధించి సోమవారం రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానాలు ఇందుకు కారణం. 

ఇదే విషయాన్ని ఆర్ఆర్, ఆర్‌సీబీ జట్లకు మంగళవారం పోలీసులు వెల్లడించారు. దీనిపై రాజ‌స్థాన్ జ‌ట్టు స్పందించలేదు. బెంగ‌ళూరు మాత్రం ప్రాక్టీస్ సెషన్ని రద్దు చేసుకుంటున్నట్టు భద్రతా సిబ్బందికి తెలియ‌జేసింది. ఇక ఎలిమినేటర్ వంటి కీల‌క మ్యాచ్‌ ముందు ప్రాక్టీస్ సెషన్స్ రద్దు చేసుకోవడం చాలా అరుదైన విషయం. అటు సాయంత్రం జరగాల్సిన మీడియా సమావేశాన్ని కూడా ఇరు జట్లు నిర్వహించలేదు. 

ఈ వ్యవహారంపై పోలీస్‌ అధికారి విజయ్ సింఘ జ్వాల మాట్లాడుతూ.. "నలుగురు అరెస్ట్ అయ్యారన్న విషయం.. అహ్మదాబాద్ వచ్చిన తర్వాత విరాట్‌ కోహ్లీ తెలుసుకున్నాడు. కోహ్లీ జాతీయ సంపద! అతని భ‌ద్ర‌త‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్‌సీబీకి రిస్క్ తీసుకోవాలనిపించలేదు. ప్రాక్టీస్ చేయడం లేదని మాకు చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ కు కూడా చెప్పాం. కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి వారికి ఇబ్బందులు కనిపించలేదు" అని తెలిపారు.

ఆర్‌సీబీ బ‌స‌ చేసిన హోటల్ వద్ద భారీ భద్రత..!
మరోవైపు అహ్మ‌దాబాద్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు బస చేస్తున్న హోటల్ వద్ద అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్‌సీబీ సభ్యులకు ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఇతరులు అందులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐపీఎల్ కి సంబంధించిన మీడియా సిబ్బందిని కూడా హోటల్ లోపలికి అనుమతించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక రాజ‌స్థాన్ జ‌ట్టు ప్రాక్టీస్ చేసిన ట్రైనింగ్ గ్రౌండ్‌కు 'గ్రీన్ కారిడార్' ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. కాగా, ప్రాక్టీస్ సెష‌న్‌కు సార‌ధి సంజూ శాంసన్ ఆలస్యంగా వెళ్లాడు. ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, రియాన్ పరాగ్, చాహల్ హోటల్లోనే ఉండిపోయారు. భారీ భద్రత మధ్య మిగిలిన ఆర్ఆర్ సభ్యులు ప్రాక్టీస్ చేశారు. పోలీసులు గ్రౌండ్ మొత్తం పెట్రోలింగ్ నిర్వ‌హించారు. కాగా, బుధ‌వారం నాటి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌కు గుజ‌రాత్ అధికారులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. స్టేడియానికి 5000 మంది పోలీసులతో పాటు 1000 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న‌ట్లు సమాచారం.


More Telugu News