హైదరాబాదులో చంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు

  • పిన్నెల్లి సొంతూరు కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ గా కూర్చున్న మాణిక్యాలరావు
  • తనను పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి బెదిరించారన్న మాణిక్యాలరావు
  • తనపై దాడి చేసి, తన కుటుంబ సభ్యులను కూడా దారుణంగా కొట్టారని వెల్లడి
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు టీడీపీ అధినేత నారా చంద్రబాబును కలిశారు. హైదరాబాద్ లో నేడు చంద్రబాబును కలిసిన మాణిక్యాలరావు... పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం వంటి పరిణామాల తర్వాత తనపై మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్ లో తలదాచుకున్నానని, ఈ విషయంలో రాష్ట్ర డీజీపీకి కూడా మొరపెట్టుకున్నానని చంద్రబాబుకు వివరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ... ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు...మాణిక్యాలరావు పోరాటాన్ని అభినందించారు.


More Telugu News