దేవుడు నాకు భజన చేసే టాలెంట్ ఇవ్వలేదు: నటుడు వినయ్ వర్మ

  • సహజమైన పాత్రలు చేయాలనుందన్న వినయ్ వర్మ
  • ముక్కుసూటిగా మాట్లాడతానని వివరణ  
  • తన ధోరణి అందరికీ నచ్చదని వ్యాఖ్య

వినయ్ వర్మ .. మంచి వాయిస్ ఉన్న నటుడు. తెరపై పాత్ర తప్ప తాను కనపడనీయని నటుడు. 'దొరసాని' వంటి సినిమాలలో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. అయితే ఆయన అడపా దడపా మాత్రమే సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. ట్రీ మీడియావారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ఆయన చిత్రంగా స్పందించారు. 

"ఇక్కడ అవకాశాలు రావాలంటే టచ్ లో ఉండాలి. గుడ్ మార్నింగ్ లు .. గుడ్ నైట్ మెసేజ్ లు పెట్టాలి. పని ఉన్నా లేకపోయినా కాల్స్ చేస్తూ ఉండాలి. కానీ అలా భజన చేసే టాలెంట్ భగవంతుడు నాకు ఇవ్వలేదు .. ఇస్తే బాగానే ఉండేదేమో. ఒకరి సమయాన్ని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు .. అందువల్లనే నేను ఎవరికీ కాల్ చేయను" అని అన్నారు. 

"పాత్ర పరంగా సహజత్వానికి దగ్గరగా ఉన్నవి చేయాలనిపిస్తుంది. అలాంటి పాత్రలు చేయడం కష్టం కాబట్టి, నన్ను నేను నిరూపించుకోవాలనిపిస్తుంది. నేను ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వను .. వాళ్లు వినలేదని బాధపడను. నేను కాస్త ముక్కు సూటి మనిషిని. అందువలన నా ధోరణి అందరికీ నచ్చకపోవచ్చు" అని చెప్పారు.



More Telugu News