అమెరికా పిచ్ లు అంతే... స్వల్పస్కోరుకే పరిమితమైన దక్షిణాఫ్రికా

  • అమెరికా గడ్డపై టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు
  • బ్యాటింగ్ కు సహకరించని పిచ్ లు
  • డ్రాప్ ఇన్ పిచ్ లతో పండుగ చేసుకుంటున్న బౌలర్లు
  • నేడు వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా × బంగ్లాదేశ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
అమెరికా పిచ్ లు అంతే...  స్వల్పస్కోరుకే పరిమితమైన దక్షిణాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్న అమెరికాలో పిచ్ లు బ్యాట్స్ మన్లకు ఏమాత్రం అనుకూలించడం లేదు. ఈ డ్రాప్ ఇన్ పిచ్ లపై 150 పరుగులు చేస్తే చాలా గొప్ప విషయం. ఇవాళ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కూడా బ్యాటింగ్ చేసేందుకు ఆపసోపాలు పడింది. భారీ హిట్టర్లతో కూడిన ఆ జట్టు న్యూయార్క్ స్టేడియం పిచ్ పై తేలిపోయింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులు చేయగలిగింది. క్లాసెన్ 46, డేవిడ్ మిల్లర్ 29 పరుగులు చేయడంతో సఫారీలకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. డికాక్ 18, రీజా హెండ్రిక్స్ 0, కెప్టెన్ మార్ క్రమ్ 4, ట్రిస్టాన్ స్టబ్స్ 0 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, తస్కిన్ అహ్మద్ 2, రిషాద్ హుస్సేన్ 1 వికెట్ తీశారు. 

డ్రాప్ ఇన్ పిచ్ అంటే...!

సాధారణంగా క్రికెట్ స్టేడియంలోనే పిచ్ లను తయారుచేస్తుంటారు. ప్రత్యేకమైన మట్టిని కొన్ని పొరలుగా రూపొందించి పిచ్ తయారు చేస్తారు. దాన్ని నిత్యం నీళ్లతో తడుపుతూ, రోలర్ తో చదును చేస్తూ ఉంటారు. దానిపై పెరిగిన గడ్డిని కత్తిరిస్తూ, మ్యాచ్ కు అనువుగా తీర్చిదిద్దుతారు. 

అయితే, డ్రాప్ ఇన్ పిచ్ లను స్టేడియంలో కాకుండా... బయట ఎక్కడో ఒక భారీ స్టీల్ ట్రేలో రూపొందిస్తారు. మట్టి, బంకమన్ను మిశ్రమాన్ని స్టీల్ ట్రేలో 22 గజాల పొడవునా పిచ్ రూపంలో మలిచి, దానిపై గడ్డిని పెంచుతారు. ఒక్కసారి ఆ పిచ్ బిగిసిన తర్వాత... ఆ స్టీల్ ట్రేను తొలగించి ఆ పిచ్ ను స్టేడియంలో అమర్చుతారు. వీటినే డ్రాప్ ఇన్ పిచ్ లు అంటారు. 

ఇవి స్పందించే తీరును అంచనా వేయడం కష్టమైన పనే. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో జరుగుతున్నది ఇదే. ఈ తరహా పిచ్ లపై హేమాహేమీ జట్లు కూడా 100 పరుగులు చేయడానికి చెమటోడ్చుతున్నాయి.



More Telugu News