కాలు విరిగిందని ఆసుపత్రికి వెళితే.. అట్టపెట్టెలతో కాలికి కట్టు!

  • బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘటన
  • రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన బాధితుడికి పీహెచ్‌సీలో అట్టపెట్టెలతో కాలికి కట్టు
  • పెద్దాసుపత్రిలో చేరాలంటూ బాధితుడికి సూచన
  • అక్కడ కూడా బాధితుడికి అట్టపెట్టె కట్టుతోనే చికిత్స 
  • విమర్శలు వెల్లువెత్తడంతో చికిత్సలో వైద్యుల మార్పులు
బీహార్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విరిగిన కాలుకు చికిత్సగా వైద్యులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాస్టుకు బదులు అట్టపెట్టతో కట్టుకట్టారు. ముజఫర్‌పూర్‌లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే, స్థానిక మీనాపూర్ ప్రాంతానికి చెందిన మహేశ్ కుమార్ అనే యువకుడు జూన్ 7న బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు విరగడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడి డాక్టర్లు అతడి కాలుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాస్ట్ వేసే బదులు అట్టపెట్టెలతో కట్టుకట్టి పెద్దాసుపత్రికి పంపించారు. పీహెచ్‌సీ వైద్యుల సూచన మేరకు బాధితుడు శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీకి వెళ్లగా అక్కడ కూడా అట్టపెట్టెలతోనే చికిత్స కొనసాగించారు. జూన్ 7 నుంచి 11 వరకూ బాధితుడు కాలికి అట్టపెట్టెలతోనే గడిపాడు. నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తున్న ఈ ఘటనపై స్థానిక మీడియా వైద్యులను నిలదీయడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించి బాధితుడికి తగిన రీతిలో చికిత్స చేశాయి. 

ఘటనపై శ్రీకృష్ణ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ‘‘మీనాపూర్ నుంచి ఆ పేషెంట్ ఇక్కడకు వచ్చారు. అప్పటికే అతడి కాలుకు కార్డుబోర్డుతో కట్టిన కట్టు ఉంది. అప్పటికి ఇంకా అతడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు సిద్ధం కాలేదని మాకు సమాచారం అందింది. ఆర్థొపెడిక్ వైద్యులను సంప్రదించగా, బాధితుడికి అదనపు పరీక్షలు జరిపాకా స్లాబ్ వేస్తామన్నారు. అయితే, పీహెచ్‌సీలో తొలుత కార్డుబోర్డు అట్టలు ఎందుకు వాడారో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాము’’ అని తెలిపారు.


More Telugu News