ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ తిరిగిరావడంలో జాప్యం.. ఇస్రో చీఫ్ స్పందన

  • బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం, ఐఎస్ఎస్‌లో ఉండిపోయిన సునీతా విలియమ్స్
  • స్టార్‌లైనర్‌ను పరీక్షించడమే సునీత విలియమ్స్ మిషన్ అన్న డా. సోమనాథ్
  • తిరుగు ప్రయాణంలో జాప్యం పెద్ద ఆందోళన కారక అంశం కాదని అభిప్రాయం
  • సునీతను భూమికి చేర్చేందుకు అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టీకరణ
బోయింగ్ స్ట్రీమ్‌లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బార్ట్ విల్మోర్ ఐఎస్ఎస్ నుంచి తిరిగిరావడం వాయిదా పడింది. ప్రస్తుతం వారిద్దరూ ఐఎస్ఎస్‌లోనే ఉన్నారు. అయితే, ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ భూమికి తిరిగిరావడంలో జాప్యం అంత ఆందోళనకారక అంశం కాదని చైర్మన్ డా. సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ఐఎస్ఎస్ ఎంతో భద్రమైన ప్రదేశమని వ్యాఖ్యానించారు. అక్కడ తొమ్మిది మంది వ్యోమగాములు ఉన్నారని గుర్తు చేశారు. వారిలో ఇద్దరు తిరిగిరావడంలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేశారు. 

‘‘వాళ్లందరూ ఏదోక రోజు తిరిగి రావాల్సిందే. బోయింగ్ నిర్మించిన క్రూ మాడ్యుల్ స్టార్‌లైనర్‌ను పరీక్షించడమే ఇక్కడ ప్రధాన అంశం. వ్యోమగాములను అంతరిక్షానికి తరలించి తిరిగి తీసుకొచ్చే సామర్థ్యం స్టార్‌లైనర్ కు ఉందా లేదా అనేది పరీక్షిస్తున్నారు. అయితే, భూమి నుంచి కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కు రప్పించే లాంచ్ ప్రొవైడర్లు సిద్ధంగా ఉన్నాయి. అసలు ఇది సమస్యే కాదు. ఐఎస్ఎస్ ఓ భద్రమైన ప్రదేశం. ఎంతకాలం కావాలంటే అంతకాలం అక్కడ ఉండొచ్చు’’ 

‘‘స్టార్‌లైనర్ వంటి ఎయిర్ క్రాఫ్టులు సక్రమంగా పనిచేయగలవా లేదా అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ప్రస్తుతం అంతరిక్ష ఏజెన్సీలు ఇదే అంశంపై దృష్టి పెట్టాయి. అయితే, సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలు అందరికీ గర్వకారణం. ఇప్పటికే ఎన్నో మిషన్లు ఆమె దిగ్విజయంగా పూర్తి చేసింది. స్టార్‌లైనర్ నిర్మాణంలో కూడా ఆమె తన అనుభవాల ఆధారంగా పలు సూచనలు చేశారు. ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. మరిన్ని వ్యోమనౌకల నిర్మాణాల్లో పాలుపంచుకోవాలని ఆశిస్తున్నా’’ అని డా. సోమనాథ్ అన్నారు. 

వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి తరలించేందుకు బోయింగ్ సంస్థ స్టార్‌లైనర్ వ్యోమనౌకను నిర్మించిన విషయం తెలిసిందే. స్టార్ లైనర్ సాయంతో సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ జూన్ 5న భూమి మీద నుంచి బయలుదేరి ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. ఆ తరువాత స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారి తిరుగుప్రయాణం ఆలస్యమవుతోంది. దీంతో, వ్యోమగాముల భధ్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.


More Telugu News