విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తరలించి ఆ ప్రాంతంలో రాజధాని కట్టేద్దామని జగన్ చెప్పారు: ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • జగన్ ప్రభుత్వంలో కొంతకాలంపాటు పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
  • ఆయన నిర్ణయాలు తనను షాక్‌కు గురిచేశాయన్న మాజీ సీఎస్
  • ఎన్నికలకు ముందే ఈ విషయాలు చెబుదామనుకుని ఆగానన్న ఎల్వీ
  • అప్పుడు చెబితే దురుద్దేశాలు అంటగడతారని చెప్పలేదని వివరణ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నగరానికి 20 కిలోమీటర్ల దూరం తరలించి, ఆ భూముల్లో రాజధానిని కట్టేద్దామని జగన్ అనడంతో తాను షాకయ్యానని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలంపాటు జగన్ ప్రభుత్వంలో ఎల్వీ సీఎస్‌గా పనిచేశారు. తాజాగా ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. జగన్ వద్ద పనిచేసిన సమయంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

‘స్టీల్‌ప్లాంట్ వల్ల కాలుష్యం పెరుగుతోంది. దానిని అక్కడి నుంచి తీసేసి, ఆ భూముల్లో రాజధాని కడదాం’ అని జగన్ చెప్పడంతో తాను నిర్ఘాంతపోయానని, దాని నుంచి తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్టీల్‌ప్లాంట్ వల్ల అంత కాలుష్యం ఏమీ ఉండదని, కావాలంటే కాలుష్య నియంత్రణ మండలితో అధ్యయనం చేయిద్దామని అంటే, ‘నీకేమీ తెలియదన్నా.. ఊరుకో. ప్రతీదానికి కేంద్రం అంటావ్’ అని విసుక్కున్నారని వివరించారు. స్టీల్ ప్లాంట్‌కు ఎంత భూమి ఉందని అడిగితే 33 వేల ఎకరాలు ఉండొచ్చని చెప్పానని, దీంతో ఆ భూముల్లో రాజధాని కట్టేసుకోవచ్చని చెప్పారని ఎల్వీ వివరించారు.

ప్రజావేదిక విషయంలోనూ అంతే
జగన్ అధికారంలోకి వచ్చాక కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారని, దానికి ప్రజావేదిక అనుకూలంగా ఉంటుందని చెప్పానని ఎల్వీ గుర్తుచేశారు. అయినప్పటికీ కాన్ఫరెన్స్ జరగడానికి రెండుమూడు రోజుల ముందు వరకు సమావేశం ఎక్కడ పెట్టాలన్న విషయంపై సీఎంవో నుంచి ఎలాంటి సమాచారమూ లేదన్నారు. ఆ తర్వాత ధనుంజయరెడ్డి ఫోన్ చేసి ప్రజావేదికలో నిర్వహించేందుకు జగన్ ఓకే చెప్పారని, ప్రజావేదికను కూల్చివేయబోతున్న విషయాన్ని కూడా చెప్పి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని, దీనిపై జగన్ స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పారని పేర్కొన్నారు. 

చూశాక మనసు మార్చుకుంటారనుకున్నా
ప్రజావేదికను చూశాక జగన్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని భావించినా అలా జరగలేదని ఎల్వీ గుర్తు చేసుకున్నారు. అక్కడున్న ఏసీలను అయినా కమాండ్ కంట్రోల్‌లో వాడుకుందామని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే పడేశారని గుర్తుచేసుకున్నారు. అమరావతిలో చంద్రబాబుకు భూములున్నాయని అనడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలా ఏకపక్ష ఆరోపణలు చేయడంతో తాను ఎదురు చెప్పలేకపోయానని పేర్కొన్నారు. ఆ తర్వాత సీఆర్‌డీఏ అధికారులను కనుక్కుంటే అమరావతి ప్రాంతంలో చంద్రబాబుకు భూములు లేవని చెప్పారని పేర్కొన్నారు.

ఏదైనా రెండు నిమిషాల్లో ముగించాల్సిందే
రాష్ట్రాభివృద్ధి, నిధులు, బడ్జెట్ వంటి అంశాలపై చర్చించేందుకు జగన్ ఏమాత్రం ఇష్టపడేవారు కాదని, అంత ఓపిక, ఆసక్తి ఆయనకు ఉన్నట్టు తాను చూడలేదని ఎల్వీ పేర్కొన్నారు. ఏ విషయాన్నైనా సరే రెండు నిమిషాల్లో ముగించాల్సిందేనని గుర్తు చేసుకున్నారు. ప్రజా వేదికను కూల్చేద్దామన్నప్పుడు కూడా తాను షాకయ్యానని చెప్పారు. అయితే, ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా ఎల్వీ చెప్పారు. మన ప్రాణాలు, భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇదే విషయాన్ని తాను చెబితే దురుద్దేశాలు అంటగడతారన్న ఉద్దేశంతో బయటపెట్టలేదన్నారు. మనం ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటున్నామన్న విషయంలో ప్రజలు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని కోరారు.


More Telugu News