25 వేళ్లతో జన్మించిన శిశువు.. భువనేశ్వరీదేవి అనుగ్రహమేనంటున్న కుటుంబ సభ్యులు

  • కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లాలో ఘటన
  • చేతికి 12, కాళ్లకు 13 వేళ్లతో చిన్నారి జననం
  • క్రోమోజోముల్లో అసమతుల్యత వల్లేనన్న వైద్యులు
  • చిన్నారిని చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు
కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలో ఓ మహిళకు వింత శిశువు జన్మించింది. రబకావి బన్‌హట్టి పట్టణంలోని సన్‌షైన్ ఆసుపత్రిలో ఓ మహిళ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి చేతికి 12 వేళ్లు, కాళ్లకు 13 వేళ్లు ఉండడంతో చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

క్రోమోజోముల్లో అసమతుల్యత వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుందని, ఇలాంటి ఘటనలు చాలా అరుదని ఆసుపత్రిలోని ప్రసూతి వైద్యురాలు డాక్టర్ పార్వతి హిరేమత్ తెలిపారు. తల్లీపిల్లలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

చిన్నారికి భారతి అని పేరు పెట్టారు. ఆమె తండ్రి గురప్ప మాట్లాడుతూ.. సంతానం కోసం తన భార్య కుందరిగి శ్రీ భువనేశ్వరీదేవి శక్తిపీఠం సురగిరి హిల్స్‌ ఆలయంలో పూజలు చేసిందని, అమ్మవారి అనుగ్రహంతోనే పాప ఇలా జన్మించిందని చెప్పారు. కాగా, గతేడాది రాజస్థాన్‌లోనూ ఓ చిన్నారి ఇలా 26 వేళ్లతో జన్మించింది.


More Telugu News