చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాక్ వెళ్లాలా? వద్దా?.. హర్భజన్ సమాధానం ఇదీ!

  • బీసీసీఐ నిర్ణయంతో ఏకీభవించిన హర్భజన్‌సింగ్
  • టీమిండియా పాక్‌ పర్యటన అంత సురక్షితం కాదని అభిప్రాయం
  • ఆటగాళ్లకు భద్రత కంటే మరేదీ ముఖ్యం కాదన్న మాజీ స్పిన్నర్
  • 2012 నుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు బంద్
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకపోవడమే మంచిదని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వంతో సంప్రదించాక కానీ భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనేదీ, లేనిదీ చెప్పలేమన్న బీసీసీఐ నిర్ణయంతో భజ్జీ ఏకీభవించాడు.

‘‘అసలు భారత జట్టు పాకిస్థాన్‌లో ఎందుకు పర్యటించాలి? అక్కడ భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు అక్కడ ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి. అక్కడికి వెళ్లడం సురక్షితమని (భారత జట్టుకు) అనుకోవడం లేదు. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయం ముమ్మాటికీ సరైనదే. మన ఆటగాళ్లకు భద్రత కంటే మరేదీ ముఖ్యం కాదు. బీసీసీఐ నిర్ణయానికి మద్దతిస్తున్నా’’ అని హర్భజన్ స్పష్టం చేశాడు. 

రండి ఫూల్‌ప్రూఫ్ సెక్యూరిటీ ఇస్తాం: పాక్
పాకిస్థాన్ మాత్రం భారత జట్టుకు వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆ జట్టు ఆడే మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహిస్తామని, టోర్నీ ఆసాంతం లాహోర్ హోటల్‌లోనే జట్టు బస చేయవచ్చని చెబుతోంది. ఇక్కడ భారత జట్టుకు ‘ఫూల్‌ప్రూఫ్ సెక్యూరిటీ’ ఇవ్వగలమని హామీ ఇస్తోంది. 

లాహోర్‌లో పీసీబీ 5 స్టార్ హోటల్
లాహోర్‌లోని గడాఫీ క్రికెట్ స్టేడియానికి దగ్గర్లో భూమి తీసుకున్నామని, అక్కడ 5 స్టార్ హోటల్ నిర్మిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని అది భావిస్తోంది. ఈ హోటల్‌ అందుబాటులోకి వస్తే తమ దేశంలో పర్యటించే జట్లకు అందులో బస ఏర్పాటు చేయొచ్చని, ఫలితంగా సెక్యూరిటీ కోసం రోడ్డును మూసివేయవచ్చని పేర్కొంది. కాగా, పాకిస్థాన్‌లో గతేడాది జరిగిన ఆసియా కప్‌కు కూడా భారత జట్టు పర్యటించలేదు. దీంతో భారత జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. భారత్-పాక్ జట్లు 2012 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు.


More Telugu News