ఒక జంట పావురాలు ఏడాదిలో ఎన్ని అవుతాయో తెలుసా...? ఆసక్తికర సంగతులివీ...!

  • ఐదు వేల ఏళ్ల కిందటి నుంచే పావురాల పెంపకం
  • వీటికి పరిస్థితులకు బాగా అలవాటు పడే సామర్థ్యం ఎక్కువ
  • మంచి నావిగేషన్ శక్తి పావురాల సొంతం
పావురాలు అంటే చాలా మంది ఇష్టపడతారు. కొందరు ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు కూడా. తెల్లగా మెరిసిపోయే పెంపుడు పావురాల నుంచి బూడిద, నలుపు రంగులు కలసిన అడవి పావురాల దాకా వాటికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పావురాల గురించి పది ఆసక్తికర సంగతులు తెలుసా?

  • ఆహారం కోసం కాకుండా వేరే అవసరాలతోనో, ఆసక్తితోనో మనుషులు పెంచుకున్న మొట్టమొదటి పక్షులు పావురాలేనని అంచనా. సుమారు 5 వేల ఏళ్ల కిందటి నుంచే పావురాలతో మనుషులకు కనెక్షన్ ఉన్నట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • పావురాలు మంచి నావిగేటర్లు. అంటే తాను ప్రయాణించే మార్గాలను బాగా గుర్తుంచుకోగలవు. అందుకే పురాతన కాలంలో సందేశాలు పంపడానికి పావురాలను వినియోగించారు.
  • పావురాలకు సంతాన సామర్థ్యం చాలా ఎక్కువ. ఒక జంట పావురాలు ఏడాదిలో తమ సంతతిని 4‌‌0, 50 వరకు వృద్ధి చేసుకుంటాయని అంచనా. ఏటా ఐదారు సార్లకుపైనే గుడ్లు పెట్టి పొదుగుతాయట.
  • మనం తినే ఆహారం నుంచి పండ్లు, గింజలు, చిన్న పురుగుల దాకా.. పావురాలు చాలా రకాల ఆహారం తిని బతకగలవు.
  • తెలివైన పక్షుల్లో పావురాలు ముందుంటాయి. వాటికి ట్రైనింగ్ ఇచ్చి మనకు కావాల్సినట్టుగా చేయించుకోవడం చాలా ఈజీ కూడా.
  • పావురాల కాళ్లకు నాలుగు వేళ్లు ఉంటాయి. అందులో మూడు ముందువైపునకు ఉంటే.. ఒకటి వెనుకవైపునకు ఉంటుంది. మంచి గ్రిప్ కోసమే ఈ ఏర్పాటు అని జీవ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
  • సాధారణ బూడిద రంగు, తెలుపుతో పాటు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే పావురాల జాతులు ఉన్నాయి. 
  • ఇవి ఎలాంటి వాతావరణానికైనా సులువుగా అలవాటు పడిపోతాయి. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఇటీవల పావురాల సంఖ్య బాగా పెరిగిపోయింది.
  • పావురాలు గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. ప్రత్యేకమైన కూతలతో ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి.
  • పావురాలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ. గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జీవిస్తాయి.


More Telugu News