పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా?... బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం!

విదేశీ ప్రయాణాలు చేసేవారికి పాస్ పోర్టు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాస్ పోర్టు జారీ చేయడంలో చాలా తతంగం ఉంటుంది. అనేక అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే పాస్ పోర్టు ఇస్తారు. అయితే, బ్రిటన్ లో ఆరేళ్ల పాపకు అధికారులు పాస్ పోర్ట్ నిరాకరించారు. అందుకు వారు చెప్పిన కారణం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

గేమ్ ఆఫ్ థ్రోన్స్... ఎంతో ప్రజాదరణ పొందిన ఫాంటసీ డ్రామా సిరీస్. ఈ వెబ్ సిరీస్ హెచ్ బీఓ చానల్లో ప్రసారమవుతుంది. అయితే, ఈ సిరీస్ లో ఓ క్యారెక్టర్ పేరు ఖలీసీ. బ్రిటన్ లో అధికారులు పాస్ పోర్టు నిరాకరించిన చిన్నారి పేరు కూడా ఖలీసీనే. ఖలీసీ అనే పేరుపై సర్వహక్కులు వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థకు చెంది ఉన్నాయని, వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అనుమతి తీసుకువస్తే, అప్పుడు తాము పరిశీలించి పాస్ పోర్టు మంజూరు చేస్తామని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు. 

దీనిపై ఆ బాలిక తల్లి లూసీ మీడియాతో మాట్లాడారు. "మేం మొట్టమొదటిసారి విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నాం. పారిస్ వెళ్లి డిస్నీలాండ్ చూడాలనుకున్నాం. కానీ అధికారుల తీరుతో మా ప్రణాళిక భగ్నమైంది. పాస్ పోర్టు కార్యాలయం నుంచి ఓ లేఖ వచ్చింది. మా పాప పేరు ఖలీసీ కాగా... ఆ పేరుపై ట్రేడ్ మార్క్ వార్నర్ బ్రదర్స్ పేరిట ఉందన్నది ఆ లేఖ సారాంశం. ఇలాంటిది కూడా ఉంటుందనేది నేను మొదటిసారి వింటున్నా. ఆ లేఖతో ఎంతో విస్మయానికి గురయ్యాను" అని వివరించారు. 

కాగా, లూసీ దీనిపై న్యాయపోరాటం చేపట్టారు. న్యాయవాదులతో పాస్ పోర్టు కార్యాలయానికి వివరణను పంపించారు. ఖలీసీ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లోని ఉత్పత్తులు, సర్వీసుల ట్రేడ్ మార్క్ కిందికి  వస్తుందని, కానీ ఇక్కడ సమస్య వ్యక్తుల పేరు గురించి కాబట్టి, దీనికి ట్రేడ్ మార్క్ నిబంధనలు వర్తించవని న్యాయవాదులు పాస్ పోర్టు ఆఫీసుకు తెలియజేశారు.

న్యాయవాదుల వివరణను పరిశీలించిన పాస్ పోర్టు కార్యాలయం... లూసీకి క్షమాపణలు తెలియజేసింది. తాము తప్పుగా అవగాహన చేసుకున్నామని, త్వరలోనే చిన్నారి ఖలీసీకి పాస్ పోర్టు జారీ చేస్తామని పేర్కొన్నారు. 

కాగా, తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్లే తనకు న్యాయం జరిగిందని లూసీ చెబుతున్నారు. గతంలో తమకు కూడా ఇలాంటి పరిణామం ఎదురైందంటూ ఆ పోస్టుపై పలువురు స్పందించారని, వారి సలహాలతోనే తాను ముందుకు వెళ్లానని వివరించారు.


More Telugu News