'ఆహా' తెరపైకి మలయాళ హారర్ థ్రిల్లర్!

  • క్రితం ఏడాది మలయాళంలో విడుదలైన 'నీలవెలిచం'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • తెలుగులో 'భార్గవి నిలయం'పేరుతో అనువాదం 
  • ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

మలయాళంలో క్రితం ఏడాది విడుదలైన హారర్ థ్రిల్లర్ చిత్రాలలో 'నీలవెలిచమ్' ఒకటి. 2023 ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. టోవినో థామస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, రీమా .. షైన్ టామ్ చాకో .. రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ప్రేక్షకులను పలకరించనుంది. 'భార్గవి నిలయం' టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఆషిక్ అబూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ స్థాయిలో భయపెడుతుందనేది చూడాలి. 

ఈ సినిమాలో కథానాయకుడు ఒక రచయిత. అతను ఒక మంచి కథను రాయడం కోసం పల్లెటూరులోని ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. పాడుబడిన ఒక ఇంటిని తీసుకుని దానిని బాగుచేయించుకుంటాడు. అయితే చాలాకాలం క్రితం ఆ ఇంట్లో భార్గవి అనే యువతి నివసించేదనీ, ఆ ఇంట్లోని బావిలో దూకి ఆమె ఆత్మహత్య చేసుకుందని ఊళ్లో వాళ్లు చెబుతారు. అప్పటి నుంచి ఆమె దెయ్యమై తిరుగుతుందని అతణ్ణి భయపెడతారు. ఆ ఇంట్లో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది కథ.


More Telugu News