ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్?: దేవినేని ఉమా

  • విజయవాడపై బుడమేరు పంజా
  • వరద ముంపునకు గురైన లక్షలాది మంది ప్రజలు
  • జగన్ మొసలి కన్నీరు కార్చడానికి వచ్చాడన్న దేవినేని ఉమా
  • జగన్ విషం చిమ్మేందుకే వచ్చాడంటూ విమర్శలు 
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఇవాళ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడానికి విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాలు ఓదార్పు కార్యక్రమం చేశాడని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు కుట్రలు, కుతంత్రాలతో, నీచపు బుద్ధితో వచ్చాడని విమర్శించారు. 

గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. బుడమేరు డైవర్షన్ కాలువ నుంచి 37,555 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కృష్ణా నదికి తరలించడానికి రూ.464 కోట్లతో చంద్రబాబు టెండర్లు పిలిపించారని, పనులు మొదలు పెట్టారని, దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టారని దేవినేని ఉమా వెల్లడించారు. 

కానీ, ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి, ఇవాళ వరదలకు కారణమయ్యారు... ఈ దుర్మార్గానికి నువ్వు (జగన్) కారణం కాదా? అంటూ నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చు పెడితే, జగన్ పాలనలో రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టారు... బుడమేరు కాలువ పనులను ఎందుకు నిలుపుదల చేశావ్? అని ప్రశ్నించారు. ఇవాళ ఈ లక్షలాది మంది వరద బాధితులకు సమాధానం చెప్పు అని డిమాండ్ చేశారు. 

ఇంత నష్టం జరిగింది నీ తప్పుడు నిర్ణయాల వల్లే కాదా? నీ అహంకార పూరిత నిర్ణయాల వల్లే కాదా? నీ మూర్ఖపు నిర్ణయాల వల్లే కాదా? నీ రివర్స్ టెండరింగ్ ల వల్లే కాదా? ప్రజలు ఏం పాపం చేశారని జరిగే పనులను ఆపేశావ్? అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు మీద కేసు పెట్టండి, దేవినేని ఉమా మీద కేసు పెట్టండి అంటూ ఆ పనులు చేసే ఏజెన్సీలపై ఒత్తిడి తీసుకువచ్చే వారని ఉమా ఆరోపించారు. 

"బుడమేరు ఆక్రమణల కారణంగా వరద బీభత్సం సృష్టిస్తే... మొన్న వచ్చి పైశాచిక ఆనందం పొందేందుకు బురద చల్లుతావా? మళ్లీ నిన్న వచ్చి బురద చల్లావు... సిగ్గుందా నీకు? విజయవాడ కరకట్ట గోడలు నువ్వు నిర్మాణం చేశావా? చంద్రబాబు ప్రభుత్వం నాడు 2.3 కిలోమీటర్ల మేర కరకట్ట గోడ నిర్మించింది. వందల కోట్లతో ఆ నిర్మాణం చేపట్టాం. 

మీ ప్రభుత్వం రాగానే ఆ పనులు ఆపేశావు... టీడీపీ నేతలు ధర్నాలు చేస్తే మళ్లీ పనులు ప్రారంభించావు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నేను కట్టానని ముద్దులు పెట్టించుకుంటావా? ఆ గోడ దగ్గర తైతక్కలాడతావా? గత ప్రభుత్వాలు రిటైనింగ్ వాల్ గురించి పట్టించుకోకపోతే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కానీ నువ్వు... అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా?" అంటూ ఉమా నిప్పులు చెరిగారు. 

ఇక, ప్రభుత్వ సహాయక చర్యల గురించి చెబుతూ... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే జిల్లా కలెక్టరేట్ లో బస చేసి యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారని ఉమా వివరించారు. జేసీబీ పైనే 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్పారని వెల్లడించారు. 

పిల్లలకు పాలు దగ్గర్నుంచి, ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం వరకు... బుడమేర ముంపు బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి సహా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారని ఉమా తెలిపారు. 



More Telugu News